Hyderabad, March 29: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. రూ.100 కోట్ల మేర పరువు నష్టం దావాకు ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లీకేజీ విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ (KTR) కొన్ని రోజులుగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ నోటీసులు పంపారు. ఇప్పటివరకు చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని చెప్పారు. కాగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజీ కేసులో కేటీఆర్ కి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలుసార్లు డిమాండ్ చేశారు. బండి సంజయ్ కూడా కేటీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారు. వారు చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలని కేటీఆర్ అంటున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే తన పేరును TSPSC కేసులోకి తీసుకువస్తున్నారని చెప్పారు. తాము ఉద్యోగాల జాతర చేపడుతుంటే అది కొనసాగకూడదని విపక్షాలు భావిస్తున్నాయని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం జరుపుతోన్న విచారణలో ఎన్నో విషయాలు బయటపడ్డాయి.
రాజకీయంగానూ ఈ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు గాను కోర్టు రాహుల్ కి శిక్ష విధించిన విషయం తెలిసిందే. అనంతరం లోక్ సభ నుంచి కూడా ఆయనను సస్పెండ్ చేశారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కు కేటీఆర్ నోటీసులు పంపడం గమనార్హం.