BRS chief and former Chief Minister KCR condoles death of Cantonment MLA Lasyanandita (Photo-Video Grab)

Hyd, Feb 23: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(33) శుక్రవారం వేకువ ఝామున పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురి కావడంతో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడిపిన ఆమె పీఏ ఆకాష్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదన్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మిక మరణం పాలవడం అత్యంత విషాదకరమన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nandita) చనిపోవడం దురదృష్టకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkatreddy) అన్నారు. సాయన్న చనిపోయి ఏడాది అయిందని.. కూతురు చనిపోవడం బాధాకరమన్నారు. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారని తెలిపారు.

బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం..హైదరాబాద్ ఓఆర్ఆర్‌ పై ప్రమాదానికి గురై మృత్యువాత.. కలిసిరాని ఈ ఏడాది.. వరుసగా మూడుసార్లు ప్రమాదాలు.. మూడోసారి తప్పించుకోలేకపోయిన యువనేత (వీడియో)

తండ్రి లాగానే లాస్య కూడా జనాలతో కలివిడిగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఆమె మృతి అందరిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. ఏసీపీతో మాట్లాడామని.. సీటు బెల్ట్ పెట్టుకోలేదని తెలిపారని చెప్పారు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా, ఎంపీగా హడావిడిగా కార్యక్రమాలకు పోతుంటామని... అందరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత (Lasya Nanditha) మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

Here's Video

లాస్య నందిత భౌతిక కాయానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాళులు అర్పించారు. కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి చేరుకున్న ఆయన ఆమె భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం లాస్య నందిత మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే సాయన్న సతీమణిని, ఇతర కుటుంబసభ్యులను కేసీఆర్‌ పరామర్శించారు.

ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

లాస్య నందిత ఇక లేరు అనే అత్యంత విషాదకరమైన షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. చాల మంచి యువ శాసనసభ్యురాలిని కోల్పోవడం తీవ్ర నష్టమని అన్నారు.

బీఅర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) సంతాపం ప్రకటించారు. బీఅర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తీవ్ర విషాదమని, తండ్రి అకాలమరణంతో చిన్న వయసులో.. విద్యాధికురాలైన ఆమెకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కిందని, అంతలోనే రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడం దురదృష్టకరమన్నారు.

ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు (వీడియో)

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు.రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అవుతుందని అనుకోలేదన్నారు. లాస్య కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలుపుతున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి, ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు.

ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు చేయగా కేవలం రెయిలింగ్‌ను ఢీకొనడం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరగలేదన్న అంచనాకు వచ్చారు. దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే.. ప్రమాదం ఎప్పుడు.. ఎలా జరిగింది..? అనే విషయాలపై ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను అడిగి పోలీసులు ఆరా తీశారు.

ఆమె మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని.. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓవర్‌ స్పీడ్‌లో ఉందని తెలిపారు. ప్రమాదం తరువాత వంద స్పీడ్‌ వద్ద స్పీడో మీటర్‌ ఆగిపోయిందని చెప్పారు. కారు బ్యానెట్‌పై రెడీ మిక్స్‌ సిమెంట్‌ ఆనవాళ్లు ఉండటంతో.. రెడీమిక్స్‌ వాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పి ఓఆర్‌ఆర్‌ రెయిలింగ్‌కు బలంగా తాకి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయిందని తెలిపారు. కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.ప్రమాద తీరును పోలీసు బృందాలు పరిశీలించాయి. త్వరలో కుటుంబ సభ్యులనూ పోలీసులు విచారించే అవకాశం ఉంది.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ సుల్తాన్‌పూర్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద ఈ తెల్లవారు ఝామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సదాశివపేటలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా.. వాహనం ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. డ్రైవర్‌ సీట్‌లో ఉన్న వ్యక్తి నిద్రమత్తు, వాహన అతివేగం ప్రమాదానికి కారణాలైన ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్‌ బ్రేక్‌ వేయడంతో కారు అదుపు తప్పి.. రెయిలింగ్‌ను బలంగా ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్య సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.