Lingojiguda Division Bypoll Result: లింగోజిగూడలో బీజేపీకి పరాభవం, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ద‌ర్ప‌ల్లి రాజ‌శేఖ‌ర్ రెడ్డి విజయం, తాజా విజయంతో బల్దియాలో మూడుకు చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య
Congress BJP logos

Hyderabad, May 3: జీహెచ్ఎంసీ ప‌రిధిలోని లింగోజిగూడ డివిజ‌న్ ఉప ఎన్నిక ఫ‌లితం (Lingojiguda Division Bypoll Result) వెలువ‌డింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. లింగోజిగూడ డివిజన్‎లో ( Lingojiguda division) జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ద‌ర్ప‌ల్లి రాజ‌శేఖ‌ర్ రెడ్డి గెలుపొందాడు. బీజేపీ అభ్య‌ర్థి మందుగుల అఖిల్ గౌడ్ గెలుస్తాడ‌ని భావించిన‌ప్ప‌టికీ, ఆ పార్టీకి షాక్ త‌గిలింది.

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక జరిగిన విషయం విదితమే. ఇక్కడ్నుంచి పోటీ పెట్టొద్దని మంత్రి కేటీఆర్‌ను బీజేపీ ముఖ్య నేతలు రిక్వెస్ట్ చేయడంతో.. టీఆర్ఎస్ తరఫున ఎవర్నీ పెట్టలేదు. దీంతో మళ్లీ సిట్టింగ్ సీటు దక్కించుకోవచ్చన్న బీజేపీకి ఊహించని రీతిలో కాంగ్రెస్ షాకిచ్చింది. ఈ గెలుపుతో కాంగ్రెస్‌కు నూతన ఉత్సాహం వచ్చినట్లుయ్యింది.

తెలంగాణలో కొనసాగుతున్న మినీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు నేడు ఓట్ల లెక్కింపు

లింగోజిగూడ డివిజ‌న్ ఉప ఎన్నిక‌లో మొత్తం 13,629 ఓట్లు పోల‌వ్వ‌గా, 13,340 ఓట్ల‌ను వ్యాలిడ్ ఓట్లుగా ప‌రిగ‌ణించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి 7,240 ఓట్లు, బీజేపీ అభ్య‌ర్థికి 5,968 ఓట్లు రాగా, నోటాకు 101 ఓట్లు వ‌చ్చాయి. 188 ఓట్లు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి.

లింగోజిగూడ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి అభ్యర్థి మందుగుల అఖిల్‌ పవన్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నుంచి దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా చాలిక చంద్రశేఖర్‌, జల్ల నాగార్జున, షేక్‌ ఫర్వేజ్‌ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి దర్పేల్లి రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ తాజా విజయంతో బల్దియాలో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య మూడుకు చేరుకుంది. అధికార పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉండి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.