Telangana Municipal Election Results 2021: తెలంగాణలో కొనసాగుతున్న మినీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు నేడు ఓట్ల లెక్కింపు
MLC Polls 2021 Counting | Photo: Twitter

Hyderabad, May 3: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు (Telangana Municipal Election Results 2021) అయింది. ఏప్రిల్‌ 30న గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో (Khammam municipal corporation, Greater Warangal municipal corporation) పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు జీహెచ్‌ఎంసీ లింగోజిగూడ డివిజన్‌, పలు మున్సిపాలిటీలలో ఒక్కో వార్డుకు ఉపఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు కూడా సోమవారం వెల్లడి కానున్నాయి.

ఓట్ల లెక్కింపు కేంద్రాలకు రావాలంటే కరోనా నెగెటివ్‌ రిపోర్టు తప్పకుండా ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్ధసారథి స్పష్టం చేశారు. అయితే ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

గ్రేటర్‌ వరంగల్‌కు సంబంధించి నగర శివారులోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో లెక్కింపు జరగనుంది. 66 డివిజన్లను 3 బ్లాకులుగా చేసి.. లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్లను లెక్కిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేసిన తర్వాత.. బ్యాలెట్ పెట్టెల్లోని ఓట్లు లెక్కిస్తారు. మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.

సాగర్‌లో గులాబీ రెపరెపలు, నోముల భగత్ విజయం, రెండో స్థానంలో జానారెడ్డి, గల్లంతయిన బీజేపీ, రౌండ్ల వారీగా ఫలితాలు ఇవే

ఖమ్మం నగరపాలక సంస్థకు సంబంధించి ఎస్​.ఆర్​. అండ్‌ బీజీఎన్​ఆర్ కళాశాలలో కౌంటింగ్‌ ప్రారంభమైంది. 60 డివిజన్లకు గానూ 10వ డివిజన్‌ను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం కాగా, 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. లెక్కింపు కోసం ప్రతి డివిజన్‌కు ఓ కౌంటింగ్ అధికారిని నియమించారు. మొత్తం 59 మంది ఆర్వోలు, ప్రతి టేబుల్‌కు ఓ సూపర్ వైజర్‌ను నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం 10 హాళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్ వీఎం హోంలో జరగనుంది. ఈ ఎన్నికలో పోటీకి టీఆర్‌ఎస్‌ దూరంగా ఉంది. నల్గొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్, మెట్‌పల్లి, జల్‌పల్లి, గజ్వేల్ మున్సిపాలిటీల్లోని ఒక్కొక్క వార్డుకు జరిగిన ఎన్నికల ఫలితాలు తేలిపోనున్నాయి. కోవిడ్‌ కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు. అయితే సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగెటివ్‌ రిపోర్టు వస్తేనే అనుమతించనున్నారు.

మోదీ షాలను కేరళలో అడుగుపెట్టనివ్వని మొనగాడు, దశాబ్దాల చరిత్రను తిరగ రాసిన విజయన్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మట్టికరిపిస్తూ ఏకపక్ష విజయాన్ని సాధించిన ఎల్‌డీఎఫ్‌

మహబూబ్‌నగర్‌ జడ్చర్ల, నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇక జడ్చర్ల మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు బీఆర్​ఆర్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. 27 వార్డులు ఉండగా.. 112 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అచ్చంపేట మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు జేఎంజే ఉన్నత పాఠశాలలో చేపట్టనున్నారు.

ఈ మున్సిపల్‌లో 20 వార్డులకు సంబంధించి నాలుగు రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. అలాగే కొత్తూరు మున్సిపల్‌ కేజీబీవీ పాఠశాలలో లెక్కింపు జరగనుంది. మూడు రౌండ్లలో కొత్తూరు ఫలితాలు రానున్నాయి. తొలిసారి ఎన్నికలు జరిగిన నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ 20 వార్డుల్లో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 43వార్డులకు గానూ 236 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.