Hyderabad, May 22: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ 11వ రోజుకు చేరుకుంది. మినహాయింపు సమయాల్లో జనం భారీగా రోడ్లపైకి రావడంతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నేటి నుంచి నుంచి 8 రోజుల పాటు లాక్‌డౌన్‌కి (Telangana Lockdown) సహకరించాలని పోలీస్ శాఖ వినతి చేసింది. 10 దాటిన తర్వాత రోడ్లపై వాహనాలు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీస్‌శాఖ హెచ్చరించింది. సీఎం కేసీఆర్ (Chief Minister K Chandrasekhar Rao) ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ సారి నేరుగా డీజీపీ మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో పలు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ఆయన పర్యవేక్షించారు.
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఉదయం 6 నుంచి 10 లోగా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. తెలంగాణ సరిహద్దుల వద్ద లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కట్టడి చేయడానికి ప్రజలందరూ సహకరించాలని మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాగా మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ ఎమర్జెన్సీ, పాసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు.. భారీగా వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలను పాటించనివారిపై కేసుల నమోదు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం అనుమతులు ఉన్నవారు మాత్రమే సంబంధిత ఐడి కార్డు గానీ, లెటర్స్ గానీ తీసుకొని రావాలని వాటిని చూపిస్తేనే అనుమతి ఇస్తామంటున్నారు.
సికింద్రాబాద్‌లోని బేగంపేట్ చిలకలగూడ బోయినపల్లి, మారేడ్‌పల్లి, కార్ఖానా పరిధిలో పోలీసులు ప్రధాన రోడ్లపై ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులను నిలిపివేసి ఏ కారణాల చేత బయటకు వచ్చారో వివరాలు తెలుసుకొని పంపిస్తున్నారు. పొంతన లేని సమాధానం చెప్పే వారిపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తూ వాహనాలను సీజ్ చేస్తున్నారు. బేగంపేటలో అడిషనల్ సీపీ అవినాష్ మహంతి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలను పర్యవేక్షించారు. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రోడ్డుపై ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలను కొనసాగిస్తున్నారు.
లాక్‌డౌన్‌లో సరకు రవాణా వాహనాలకు అనుమతి లేదని సీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచి గూడ్స్ వాహనాలకు అనుమతి లేదని సీపీ వెల్లడించారు.