
Hyderabad, May 18: హైదరాబాద్ నారాయణగూడ అవంతినగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire Accident in HYD) సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసే శాంతారామ్‌కు ముగ్గురు కుమారులు.
అందరికీ వివాహాలు కావడంతో మూడు అంతస్థులు ఉన్న ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగానే కొనసాగుతున్నారు. మొదటి అంతస్థులో తల్లిదండ్రులతోపాటు చిన్న కుమారుడు, రెండో అంతస్థులో కవలపిల్లలైన ఇద్దరు అన్నదమ్ములు గౌరీనాథ్, బద్రీనాథ్‌లు వారి పిల్లలతో పాటు నివసిస్తున్నారు. ఇంటి వాచ్‌మన్ సంగ్‌రామ్ కుటుంబం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గదిలో ఉంటోంది.
లాక్‌డౌన్ కావడంతో శాంతారామ్ దంపతులు, చిన్న కుమారుడు శ్రీనాథ్ కుటుంబం కలిసి గత ఆదివారం ఉదయం వికారాబాద్‌కు వెళ్లారు. దీంతో మొదటి అంతస్థులో ఆదివారం రాత్రి ఎవరూ లేరు. అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు మూడు గంటల ప్రాంతంలో మొదటి అంతస్థులో ఉన్న ఏసీలలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఇళ్లంతా పూర్తిగా కప్‌బోర్డ్సుతో ఉండటం వల్ల వాటికి మంటలు అంటుకున్నాయి.
దీంతో దట్టమైన పొగలతోపాటు మంటలు దావానలంలా (Massive fire accident in Hyderabad) వ్యాపించాయి. మొదటి అంతస్థు నుంచి రెండో అంతస్థుకు మంటలు వ్యాపించడంతో బద్రీనాథ్, గౌరీనాథ్‌లు నిద్రలేచి తలుపులు తెరిచిచూశారు. అప్పటికే దట్టమైన పొగతో వారికేమీ కనిపించలేదు. దీంతో వెంటనే గౌరీనాథ్ తన భార్య వీణామానస, పిల్లలు లోకేష్, విగ్నే్‌షలను బాత్‌రూమ్‌లో ఉంచి తలుపులు మూసేశాడు. మరోవైపు ఇంకో బెడ్‌రూమ్‌లో బద్రీనాథ్ ఒక్కడే ఉన్నాడు.
భార్యా పిల్లలు అత్తగారింటికి వెళ్లడంతో ఘటన సమయంలో ఒక్కడే ఉన్నాడు. అతడు కూడా వేరే బాత్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ పెట్టేసుకున్నాడు. భార్య, పిల్లలను కాపాడే క్రమంలో మంటలను ఆర్పివేయడానికి తీవ్రంగా ప్రయత్నించిన గౌరీనాథ్ (38) దట్టమైన పొగతో ఊపిరి ఆడక అపస్మారక స్థితికి వెళ్లి మంటల్లోనే సజీవ దహనం అయ్యాడు. వాచ్‌మన్ ఫోన్‌తో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన గౌరీనాథ్ భార్య, ఇద్దరు పిల్లలు, సోదరుడు బద్రీనాథ్‌ను సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు పిల్లలకు శ్వాస సమస్య తలెత్తడంతో తర్వాత రెయిన్‌బో చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.