Warangal, April 20: తెలంగాణలో సంచలనం రేపిన వరంగల్ ఎంజీఎం డాక్టర్ ప్రీతి మృతి కేసులో (Medico Preethi Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ కు కోర్టు బెయిల్ (Bail For Saif) మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. 10 వేల రూపాయలు ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. 16 వారాల పాటు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ఉన్న నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా.. బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించారు న్యాయమూర్తి. డాక్టర్ సైఫ్ (Saif) గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఆత్మహత్యాయత్నానికి ముందు సైఫ్ వేధింపులపై ఫోన్ లో తన తల్లితో చెప్పి ప్రీతి బాధపడింది. డాక్టర్ సైఫ్ తనతోపాటు జూనియర్స్ ను వేధిస్తున్నాడని ప్రీతి తన తల్లికి చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్ వేధింపులు రోజు రోజుకూ ఎక్కువై పోతున్నాయంది. అయితే, భయపడొద్దు అంటూ తల్లి శారద ప్రీతికి చెప్పింది. ధైర్యంగా ఉండాలని పదే పదే చెప్పింది. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ప్రీతి సూసైడ్ చేసుకుంది.