Hyd, April 19: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ.. ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డిని ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది. అవినాశ్ రెడ్డి విచారణను అధికారులు వీడియోలో రికార్డు చేశారు. అంతేకాకుండా ఆయన నుంచి లిఖితపూర్వకంగా సమాధానాలను తీసుకున్నారు. విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఉదయ్, భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా అవినాశ్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
వివేకా హత్యకు మూడు గంటల ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించినట్టు, ఈ కేసులో అరెస్టయిన వారందరూ అవినాశ్‌తో ఎందుకు సమావేశమయ్యారో ఆరా తీసినట్టు సమాచారం. మళ్లీ రేపు 10.30కు రావాలని అవినాశ్ రెడ్డిని ఆదేశించారు. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి ఉదయ్, భాస్కర్ రెడ్డి విచారణ కూడా పూర్తి కావడంతో అధికారులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. వివేకా హత్యకు దారితీసిన కారణాలు, హత్యకు గురైతే గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారనే దానిపైనే విచారణ సాగినట్లు తెలుస్తోంది.