
Hyd, April 18: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనల తర్వాత.. ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణ సమయంలో అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని సీబీఐని ఆదేశించింది. అలాగే రేపటి నుంచి 25వ తేదీవరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్‌రెడ్డిని ఆదేశించింది. అలాగే.. 25వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పు ఇస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే.. వివేకా కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్‌రెడ్డి పిటిషన్ వేయగా రెండు రోజులపాటు వాదనలు జరిగాయి. మంగళవారం గంటన్నరకు పైగా హాట్‌హాట్‌గా వాదనలు కొనసాగాయి.
ఎంపీ అవినాష్‌రెడ్డి తరఫు న సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘దస్తగిరి వాంగ్మూలం మినహా అవినాష్‌పై ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తులో గూగుల్ టేకవుట్ డేటాపై ఆధారపడటం తగదు. సునీల్ యాదవ్ కదలికలపై దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ డేటా విరుద్ధంగా ఉన్నాయి. దస్తగిరి చెప్పింది తప్పా? గూగుల్ డేటా తప్పా? కుటుంబ, ఆర్థిక వివాదాలు, వివాహేతర సంబంధాలే వివేకా హత్యకు కారణమై ఉండొచ్చు. బంధువు కాబట్టి హత్యా స్థలికి వెంటనే వెళ్లాం. గదిని శుభ్రం చేయడం వెనుక ఎలాంటి కుట్ర లేదు’’ అని వాదించారు.
ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. వివేకాకు గుండెపోటు అని ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. అక్కడున్న వారు గుండెపోటు అని చెబితే అదే విషయం చెప్పారని అవినాష్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నేటి విచారణపై స్పష్టత ఇవ్వాలని, సీబీఐ విచారణకు వెళ్లేందుకు అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు ఉదయం విచారిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవినాష్‌రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. ‘‘గతంలో నాలుగుసార్లు ప్రశ్నించినప్పుడు అవినాష్ సహకరించలేదు. వివేకా హత్య కుట్ర అవినాష్‌రెడ్డికి తెలుసు.
దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించాం. అవినాష్‌రెడ్డి చాలా ప్రభావం చేయగల వ్యక్తి. ఆర్థిక, వివాహేతర సంబంధాలపై ఆధారాలులేవు. హత్యలో ఉపయోగించిన ఆయుధం రికవరీ కాలేదు. హత్య తర్వాత నిందితుడు ఆయుధంతో అవినాష్ ఇంటికి వెళ్లాడు’’ అని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ .. ‘‘సీబీఐ నోటీసులు ఇచ్చినప్పుడల్లా కోర్టుకు వస్తున్నారు. అవినాష్ ప్రమేయంపై నిందితులు, సాక్షులు సీబీఐకి చెప్పారు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు.