Migrant Workers Tragedy: తొమ్మిది మంది మృత్యుమిస్టరీ వీడింది, నిద్ర మాత్రల ఇచ్చి బావిలో పడేసిన నిందితుడు, పోలీసుల అదుపులో పలువురు నిందితులు
Warangal Suspect Deaths (Photo-Twitter)

Hyderabad, May 25: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ (Warangal) జిల్లాలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట బావిలోని 9 మంది మరణాల వెనుకున్న మిస్టరీ (Migrant workers tragedy) వీడింది. నిద్ర మాత్రలు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాక వారిని తానే బావిలో పడేసినట్లు నిందితుడు సంజయ్‌కుమార్‌యాదవ్‌ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. మహ్మద్‌ మక్సూద్‌ ఆలం కూతురు బుష్రా ఖాతూన్‌ ప్రియుడిగా అనుమానిస్తున్న సంజయ్‌కుమార్‌ యాదవ్‌ తన బిహార్‌ స్నేహితులతో కలసి వారిని హత్య (migrant workers murder) చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

వరంగల్‌రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఓ గోనె సంచుల గోదాము ఆవరణలోని పాడుబడిన బావిలో గత గురువారం నలుగురివి, శుక్రవారం ఐదుగురి మృతదేహాలను పోలీసులు కనుగొన్న విషయం తెలిసిందే. మృతుల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు, ఇద్దరు బీహారీలు, ఒకరు త్రిపుర వాసి ఉండడం కలకలం రేపింది. వరంగల్‌లో కలకలం రేపుతున్న వలసకూలీల డెత్ మిస్టరీ, బావిలో నుండి 9 అనుమానాస్పద శవాలు వెలికితీత, హత్యా,ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ఈ నెల 20న రాత్రి ముందుగా కూల్‌డ్రింక్స్‌లో నిద్ర మాత్రలు ఇచ్చి వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నాక స్నేహితుల సాయంతో గోనెసంచుల్లో పెట్టి పాడుపడిన వ్యవసాయబావిలో పడేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సంజయ్‌కుమార్‌కు ఎవరెవరు సహకరించారనేది ఇంకా తెలియాల్సి ఉండగా సంజయ్‌తోపాటు మిడిదొడ్డి యాకూబ్, మంకుషా, మక్సూద్‌ మరదలు, ఓ ఆటో డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

ఈ మిస్టరీని ఛేదించేందుకు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ రవీందర్‌ ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరిగిన తర్వాత వారివి హత్యలేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో ప్రత్యేక బృందాలు హత్యల కోణంలో దర్యాప్తు వేగవంతం చేశాయి. టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌, సైబర్‌ క్రైం, ఐటీకోర్‌ టీం, ఇంటెలిజెన్స్‌, ఫోరెన్సిక్‌ తదితర విభాగాల అధికారులు మరోసారి గొర్రెకుంటలోని ఘటనా స్థలాన్ని సందర్శించి.. గోదాము ఆవరణ, పాడుబడిన బావి పరిసరాలను పరిశీలించారు.

మృతుల మొబైల్‌ కాల్‌ డాటాపై దృష్టిపెట్టారు. మృతిచెందిన తొమ్మిది మందిలో ఎండీ మక్సూద్‌, అతని భార్య నిషా, కూతురు బష్రాఖాతూరు, ఇద్దరు బీహారీలు శ్యామ్‌కుమార్‌, శ్రీరామ్‌కుమార్‌, షకీల్‌ మొబైల్స్‌కు ఘటన జరగడానికి ముందు వచ్చిన ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ డాటా తీశారు. తమకు లభించిన ఆధారాలతో శనివారం వరంగల్‌లో ఉంటున్న బీహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌యాదవ్‌తోపాటు మరో యువకుడిని, మక్సూద్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న వరంగల్‌కు చెందిన యాకూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో సంజయ్‌కుమార్‌యాదవ్‌ నిద్ర మాత్రలు ఇచ్చి తొమ్మిది మందిని హత్యచేసినట్లు అంగీకరించాడని తెలిసింది. గత బుధవారం రాత్రి గోదాములో మక్సూద్‌ మనుమడి బర్త్‌డే జరిగింది. ఈ ఫంక్షన్‌ వేదికగా సంజయ్‌కుమార్‌ యాదవ్‌ పక్కా ప్లాన్‌ రూపొందించుకుని అమలుచేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు దారితీసినట్లు సమాచారం.

నేడో, రేపో ఈ ఘటనపై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. కాగా, హైదరాబాద్‌ సిటీ క్లూస్‌ టీం ఆదివారం గొర్రెకుంటలో పలు ఆధారాలను సేకరించింది. ఎంజీఎంలో ఉన్న 9 మృతదేహాలపై ఫింగర్‌ప్రింట్స్‌తోపాటు రక్తం, శరీర ద్రవాలు, జుట్టు, ఇతర కణజాలాలకు సంబంధించిన జీవ ఆధారాలను కూడా సేకరించినట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసింది.