Hyderabad, November 5: సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మేట్ (Abdullahpurmet)) హత్య ఘటనలో ఎమ్మార్వో విజయా రెడ్డి (MRO Vijaya Reddy)ని రక్షించే యత్నంలో తీవ్రంగా గాయపడిన ఆమె డ్రైవర్ గురునాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోమవారం రోజు విజయా రెడ్డి సజీవదహనం అవుతుండటం చూసి డ్రైవర్ గురునాథ్‌తో పాటు, అటెండర్ వెంటనే స్పందించి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తూ గురునాథ్‌కి కూడా మంటలంటుకోవడంతో ఆయన శరీరం కూడా 90 శాతం కాలిపోయింది. ఈ క్రమంలో ఆయన శరీరం చికిత్సకు సహకరించక చనిపోయాడని అపోలో వైద్యులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసులో కుట్ర కోణం ఏదైనా ఉందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కూర సురేష్ (Koora Suresh) కు తహసీల్దార్‌కు మధ్య భూమి క్రమబద్దీకరణ విషయంలో వివాదాలు ఉండటం వల్లనే అతడు ఈ హత్య చేశాడని ప్రధానంగా ఒక వార్త వినిపిస్తూ వచ్చింది. అయితే తమ కొడుకుకి అసలు భూమి గురించి ఎలాంటి అవగాహన లేదని సురేష్ తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కొడుకు అమాయకుడు, ఒకరిని చంపేంత ధైర్యం లేదు, ఎవరో కావాలనే చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటు గ్రామస్థులు కూడా సురేష్‌కు మతిస్థిమితం లేదని చెపుతున్నారు. కొంతమంది అతడిని రెచ్చగొడుతూ ఆటపట్టిస్తారని, ఎవరైనా రెచగొట్టగానే రెచ్చిపోయి ఏదైనా చేసేయగల స్వభావం గలవాడని గ్రామస్థులు అంటున్నారు. దీనినే అదనుగా చేసుకొని, సురేష్‌ను తహసీల్దార్‌పై ఉసిగొల్పి ఆమెను హత్య చేయించి ఉండవచ్చు అని గౌరెల్లి గ్రామస్థులు పేర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మరియు ఒక రాజకీయ నేతకి భూముల విషయంలో తహసీల్దార్ అడ్డుకట్టగా ఉండటంతోనే ఒక మతిస్థిమితం లేనివాడిని వాడుకొని హత్య చేయించి ఉండవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఆ భూములు రైతులకు సంబంధినవి కావడం, వాటిపై కోర్ట్ కేసులు పెండింగ్‌లో ఉండటంతో కోర్టు కేసులు పరిష్కారం అయ్యేంతవరకు ఆ భూములను రియల్ ఎస్టేట్ సంస్థకు రెవెన్యూ అధికారులు బదిలీ చేయకపోవడంతోనే ఎమ్మార్వోను అంతమొందించాలని కుట్ర జరిగినట్లుగా చెబుతున్నారు. సురేష్‌కు పెట్రోల్ అందించి ఎమ్మార్వోని హత్య చేయడంతో పాటు, రైతులకు అన్యాయం చేస్తున్నందుకు నిరసనగా తహసీల్దార్ కార్యాలయం ఎదుటే అదే పెట్రోల్‌తో ఆత్మహత్యయత్నం చేసుకొని నిరసన వ్యక్తం చేయాలని కూడా ఉసిగొల్పినట్లుగా అంచనావేస్తున్నారు. ఈ కేసులో అసలు సూత్రధారులను పట్టుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ శివారులో ఔటర్ రింగురోడ్డుకు సమీపంలో ఉండే ఈ ప్రాంతాల భూములు చాలా ఖరీదైనవని, ఒక ఎకరం విలువ కూడా కోట్ల రూపాయలలో ఉంటుంది. అందుకే ఇక్కడి భూముల కోసం ల్యాండ్ మాఫియాతో స్థానిక రాజకీయ పెద్దలు మరియు స్థానిక రెవెన్యూ సిబ్బంది ఏదో రకంగా రైతులను మభ్యపెట్టి ఆ భూములను వారి నుండి లాక్కొనే ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంటుందని ఒక ఆరోపణ ప్రముఖంగా వినిపిస్తుంది.