Hyd, Dec 27: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ 5 గంటల వరకు ఓఆర్‌ఆర్, పీవీ ఎక్స్‌ప్రెస్ వేను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే ఆ రూట్లో అనుమతించనున్నట్లు తెలిపారు.
సైబరాబాద్ పరిధిలోని శిల్పా లే అవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట, మైండ్‌స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, ఖైతలాపూర్, బాలానగర్ ఫ్లై ఓవర్లు, దుర్గం చెరువు వంతెనలను 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేస్తామని వెల్లడించారు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని సైబరాబాద్ పోలీసులు ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను వాట్సప్ నెంబర్ 94906-17346కు ఫిర్యాదు చేయవచ్చనని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.