Water Shutdown in Hyd: హైదరాబాద్‌లో 3 రోజులు వాటర్ సరఫరా బంద్, ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి మేరకు షట్‌డౌన్ ప్రకటించిన జలమండలి అధికారులు, నీటి సరఫరా ఉండని ప్రాంతాల లిస్ట్ ఇదే
no-water-supply-three-days-in-hyderabad-says-hmwssb (Photo-Twitter)

Hyderabad,October 14: తెలంగాణా రాజధాని గ్రేటర్ హైదరాబాద్ వాసుల దాహార్తిని తీరుస్తున్న గోదావరి జలాల సరఫరా సేవలు మూడు రోజులపాటు నిలిచిపోనున్నాయి. దీంతో నగరంలో 3 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ మేరకు జలమండలి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు పథకం పనుల్లో భాగంగా గోదావరి జలాల సరఫరాలో ఇబ్బంది కలుగుతోందని ఫలితంగా 3 రోజులు షట్‌డౌన్ ప్రకటిస్తున్నామని అధికారులు తెలిపారు. నగరంలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ప్యాకేజీ-13లో భాగంగా ఇరిగేషన్ శాఖ గ్రావిటీ కెనాల్ నిర్మాణం జరుగుతుంది. గజ్వేల్ మండలపరిధిలోని కోడకండ్ల గ్రామం వద్ద నగరానికి వచ్చే గోదావరి 3000 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్ ఈ కెనాల్ నిర్మాణానికి అడ్డుగా వస్తున్నది. దీంతో ఈ భారీ పైపులైన్ ఇతర చోటికి మారుస్తున్న క్రమంలో ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి మేరకు జలమండలి అధికారులు మూడు రోజుల పాటు షట్‌డౌన్ ప్రకటించారు.

నీటి సరఫరా ఉండని ప్రాంతాలు

ఎర్రగడ్డ, బోరబండ, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్‌గూడ, ఎస్‌ఆర్‌నగర్, ఆమీర్‌పేట, బంజారాహిల్స్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, బాలానగర్, భాగ్యనగర్, భరత్‌నగర్, సనత్‌నగర్, బోరబండ రిజర్వాయర్ పరిధి, చింతల్, జీడిమెట్ల, షాపూర్‌నగర్, సూరారం, జగద్గీరిగుట్ట, కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్, డిఫెన్స్‌కాలనీ, గౌతంనగర్, ప్రశాంత్‌నగర్, చాణక్యపురి, మల్కాజ్‌గిరి, ఫతర్‌బాలాయినగర్, అల్వాల్, న్యూ ఓయూటీ కాలనీ, కైలాసగిరి, హఫీజ్‌పేట, మియాపూర్, మాతృశ్రీనగర్, మయూరినగర్, చందానగర్, ఆర్సీపురం, పటాన్‌చెరు, బోలారం, మయూరినగర్, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి, బోల్లారం, ఆమీన్‌పూర్, మల్లంపేట, జవహర్‌నగర్, బాలాజీనగర్, కీసర, దమ్మాయిగూడ, నాగారం, చేర్యాల్, ఆర్‌జికే, అహ్మద్‌గూడ, దేవరాయాంజల్, తూంకుంట, ఎన్‌ఎఫ్‌సీ, పోచారం, సింగాపూర్ టౌన్‌షిప్, మౌలాలీ, లాలాపేట, తార్నాక, సీఆర్‌పీఎఫ్, మెస్, కంటోన్మెంట్ బోర్డు పరిధి, తుర్కపల్లి బయోటెక్ పార్కు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.