Hyderabad Metro: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ మెట్రోలో ఉచిత వీడియో స్ట్రీమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ సదుపాయం, సినిమాలు, గేమ్స్ డౌన్‌లౌడ్ చేసుకునే విధంగా Zee5 సేవలు ప్రారంభం, త్వరలోనే QR కోడ్ టికెటింగ్ సౌకర్యం కూడా
Hyderabad Metro. | (Image Credits: Wikimedia Commons)

Hyderabad, December 11:  హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైళ్లలో ప్రయాణించే వారికి సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులు ఉల్లాసవంతమైన, వినోదాత్మకమైన ప్రయాణాన్ని ఆస్వాదించడం కోసం షుగర్ బాక్స్ నెట్‌వర్క్‌ (Sugarbox Network)తో హైదరాబాద్ మెట్రో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

దీని ప్రకారం మెట్రో ప్రయాణికులు ఎలాంటి తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ డేటాను వినియోగించకుండానే 'ఫ్రీ వైఫై' (Free Wi-Fi)కనెక్టివిటీ ద్వారా నిరంతరాయంగా వీడియోలు, ఆన్ లైన్ గేమ్స్ ఆడుకోవచ్చు. అంతేకాకుండా సినిమాలను కూడా కేవలం 3 నుంచి 15 నిమిషాలలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఇందుకోసం ప్రయాణికులు తమ మొబైల్స్ లో వై-ఫై సెట్టింగులలో 'షుగర్ బాక్స్' కోసం వెతికి కనెక్ట్ చేసుకోవాలి. అంతకుముందు ZEE5 లేదా ఫ్రీప్లే (Freeplay App) యాప్ తెరిచి ప్రయాణికులు తమ మొబైల్ నెంబర్లను అందులో రిజిస్టర్ చేసుకోవాలి.

తొలి దశలో ఈ షుగర్ బాక్స్ జోన్ల (Sugarbox Zones)ను నగరంలోని 10 ప్రధాన స్టేషన్ల మధ్య నడిచే అన్ని మెట్రో రైల్ సర్వీసుల్లో ఏర్పాటు చేశామని, క్రమక్రమంగా వీటిని విస్తరించనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్ ( HMRL) అధికారులు తెలిపారు. అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు లభించే ఈ తరహా (In-flight like entertainment)సేవలను దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ మెట్రోలోని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

ఇక ఇదేకాకుండా, వారంరోజుల క్రితమే హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే మహిళా ప్రయాణికుల భద్రత కోసం పెప్పర్ స్ప్రే తీసుకెళ్లడానికి అనుమతిస్తున్న హైదరాబాద్ మెట్రో, నగర ప్రజా రవాణాను మరింత సులభతరం చేయడానికి త్వరలోనే యాప్-బేస్డ్ లేదా క్యూఆర్ కోడ్ ఆధారిత టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే మెట్రో ప్రయాణికులు టికెట్ల కోసం లైన్ లో వేచి ఉండాల్సిన ఇబ్బందులు తప్పుతాయి నేరుగా తమ మొబైల్ ద్వారానే టికెట్స్ కొనుగోలు చేసే సౌకర్యం కలుగుతుంది. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న మెట్రో కార్డుకు అదనపు ప్రయోజనకారిగా ఉంటుంది. డిసెంబర్ చివరి నాటికి క్యూఆర్ కోడ్ విధానం ప్రవేశపెడతామని హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తెలియజేశారు.