Asaduddin Owaisi: ఎన్ఆర్సీని తెలంగాణాలో వ్యతిరేకించండి, సీఎం కేసీఆర్‌ని కోరిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కి తేడా లేదన్న ఎంపీ, ముస్లీం ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలన్న పిలుపుకు అనూహ్య స్పందన
Amit Shah - Asaduddin Owaisi (Photo Credits: PTI/IANS)

Hyderabad, December 25: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ (Asaduddin Owaisi)ఒవైసీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (Telangana CM KCR) కలిశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న ఎన్ఆర్సీని వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. యునైటెడ్ ముస్లిం యాక్షన్ ఫోరం బృందంతో కలిసి అసదుద్దీన్ సీఎం కేసీఆర్‌ను ఎంపీ అసదుద్దీన్ కలిశారు.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మత ప్రాతిపదికనే ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ ను (CAA,NRC,NPR) అమలు చేయవద్దని సీఎంను కోరినట్లు ఒవైసీ చెప్పారు. ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్సీకి తేడా లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై భావసారూప్యత గల పార్టీలతో కలిసి ముందుకెళతామన్నారు.

ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ హాజరయ్యారు. ‘‘ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ రెండూ వేర్వేరని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంటున్నారు. ఆ రెండింటికీ తేడా లేదు. ఎన్‌ఆర్‌సీకి ఎన్‌పీఆర్‌ తొలి అడుగుగా నిలుస్తుంది. ఈ అంశంలో రెండు రోజుల్లో టీఆర్ఎస్ నిర్ణయం చెబుతామని సీఎం చెప్పారు. రాజకీయ పార్టీలతో సమావేశమవుదామని ఆయన అన్నారు.

మీడియాతో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

కేసీఆర్‌ సానుకూలంగా స్పందిస్తారనే ఆశాభావంతో ఉన్నాం. ఇది కేవలం సామాజికవర్గం సమస్య కాదు.. రాజ్యాంగం, దేశానికి సంబంధించిన సమస్య. ఈనెల 27 నిజామాబాద్‌లో సభ నిర్వహిస్తున్నాం. ఆ సభకు తెరాస నేతలు కూడా హాజరవుతారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీటింగ్ అనంతరం తెలిపారు.

ఒవైసీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు

పౌరసత్వ సవరణ చట్టంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఖండించారు. దారుస్సలాంలో జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభించడం మొదటిసారి జరిగిందని పేర్కొన్నారు. బారిస్టర్‌ చదివిన ఎంపీ అసద్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేలా లోక్‌సభలో బిల్లును చింపడంపై మండిపడ్డారు. ఒవైసీ రాజ్యాంగాన్నే కాదు దేశాన్ని అవమానించారన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై బహిరంగ చర్చకు సిద్దమా అని ప్రశ్నించారాయన. చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని నిరూపించలేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి అనూహ్య రెస్పాన్స్

ఇదిలా ఉంటే ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చిన పిలుపుకు అద్భుతమైన స్పందన వస్తోంది. హైదరాబాద్‌లో ముస్లింల ఇళ్లపై జాతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పాతబస్తీ సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు త్రివర్ణ పతకాన్ని సగర్వంగా ఎగరవేసి వారి దేశభక్తిని చాటుకుంటున్నారు. పాతబస్తీలోని చాంద్రయణగుట్ట, గోల్కొండ, కార్వాన్, లంగర్ హౌజ్‌లో ముస్లింల ఇళ్లపై రెండు రోజులుగా జాతీయ జెండాలు రెపరెపలాడుతూ ఉండడం కనిపిస్తోంది.