Omicron in Telangana: కరోనా థర్డ్‌వేవ్‌ దూసుకొస్తోంది, తెలంగాణలో వచ్చే 2,3 వారాలు చాలా కీలకమని తెలిపిన రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచన
Telangana Director of Public Health, G Srinivasa Rao (Photo-ANI)

Hyd, Dec 30: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఎటువంటి ప్రయాణ చరిత్ర, ఎలాంటి కాంటాక్ట్‌ లేకపోయినా ఒమిక్రాన్‌ వేరియంట్ (Omicron in Telangana) చాపకింద నీరులా వ్యాప్తిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులపై రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో త్వరలోనే ఒమిక్రాన్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే 2,3 వారాలు చాలా కీలకమని (Next two weeks crucial) వెల్లడించారు. ఒమిక్రాన్‌ బాధితులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నారని, ఇది థర్డ్‌వేవ్‌ ప్రారంభానికి సూచిక అని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని ఆయన (State director of public health G Srinivasa Rao) సూచించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందన్నారు. యూకే, యూఎస్‌ లాంటి దేశాల్లో ఒక్కసారి కేసులు లక్షల్లో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు.

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 235 మందికి కోవిడ్, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 121 కొత్త కేసులు

మరోవైపు ఒమిక్రాన్ కేసుల్లో దేశంలోనే తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఢిల్లీ(263), మహారాష్ట్రలు(252) మొదటి రెండు స్థానంలో ఉన్నాయి. తరువాత గుజరాత్‌, రాజస్థాన్‌, కేరళ ఉన్నాయి. తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 62కు చేరింది. బుధవారం ఒక్క రోజే ఏకంగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒకరు ల్యాబ్ టెక్నీషియన్, ఓ గర్భిణి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తదితరులు ఉన్నారు.