Hyderabad, May 10: కరోనా వైరస్ కు చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే కరోనా రోగుల వాహనాలను (: Telangana police stop entry of AP Ambulance vehicles) తెలంగాణ పోలీసులు అనుమతించట్లేదు. ఏపీ సరిహద్దును దాటి వస్తున్న పేషెంట్లను తెలంగాణ పోలీసులు (TS Police) సరిహద్దు వద్దే నిలుపుదల చేస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ వద్ద తెలంగాణ పోలీసులు (Telangana Police) ఈ రోజు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు.
ఇక్కడ ఏపీ (Andhra Pradesh)నుంచి వస్తున్నకరోనా పేషెంట్లను తెలంగాణలోకి అనుమతించడంలేదు. అంబులెన్స్‌లను అడ్డుకుని, వాటిని వెనక్కి పంపుతున్నారు. తెలంగాణలోని ఆస్పత్రుల్లో అనుమతులు పొందిన వారికి మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నుంచి అమలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా రోగులను తెలంగాణలోకి అనుమతించట్లేదని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఇతర వాహనాలను మాత్రం పోలీసులు అనుమతిస్తున్నారు.
కాగా హైదరాబాద్‌లో కరోనా చికిత్సల కోసం ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సౌకర్యాలు లేవని పోలీసులు అంటున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న కర్నూలు పోలీసులు పుల్లూరు టోల్‌గేట్ వద్దకు చేరుకుని తెలంగాణ పోలీసులతో మాట్లాడారు. తమ ఆసుపత్రులలో పడకలు ఉన్నాయని, చేర్చుకుంటామని ఆయా ఆసుపత్రులు హామీ ఇస్తే కనుక అంబులెన్స్‌లను తెలంగాణలోకి విడిచిపెడుతున్నారు.