
Hyderabad, March 30: తెలంగాణలో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నప్పటికీ కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజల్లో ఇంకా చైతన్యం రావడం లేదు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశ్యంతో మతపరమైన వేడుకలు, బహిరంగ ప్రదేశాలలో గుమిగూడటంపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బయటకు వెళ్తే, మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. అయినప్పటికీ ఇవేమి పట్టనట్లుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ నగరంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో యువత వీధుల్లోకి వచ్చి కరోనా నిబంధనలేవి పాటించకుండా హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఇలా కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం ద్వారా అందులో ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా అది అందరికీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది.
రాష్ట్రంలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 42,261 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 463 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 906 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,07,205కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 145 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 46 కేసులు, రంగారెడ్డి నుంచి 28 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 4 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,694కు పెరిగింది.
అలాగే సోమవారం సాయంత్రం వరకు మరో 364 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,00,833 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,678 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ప్రస్తుతం వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 11.85 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరిగినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.