
Hyderabad, FEB 22: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ఫోన్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను రేవంత్‌రెడ్డి.. ప్రధానికి వివరించారు. సొరంగంలో ఎనిమిది మంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఘటనా స్థలికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్టు ప్రధాని మోడీ.. సీఎంకు చెప్పారు. పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 3 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. విజయవాడ నుంచి రెండు, హైదరాబాద్ నుంచి ఒక బృందం ఘటనా స్థలికి చేరుకున్నాయి. సింగరేణి నిపుణుల బృందం కూడా అక్కడికి వెళ్లనుంది. నాగర్‌కర్నూల్ కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
PM Narendra Modi Speaks to CM Revanth Reddy on Rescue Measures
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆరా తీశారు. ముఖ్యమంత్రి గారు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానమంత్రి గారికి తెలియజేశారు.
సొరంగంలో ఎనిమిది… https://t.co/3vWoe1AHux pic.twitter.com/8v9ekpAkiW
— Telangana CMO (@TelanganaCMO) February 22, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది. ఇందులో భాగంగా నాలుగు రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం మొదటి షిఫ్ట్‌లో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. ఉదయం 8.30 గంటల సమయంలో కార్మికులు పని చేస్తుండగా.. అకస్మాతుగా పైకప్పు కూలింది. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. వారిలో 42 మంది బయటకి రాగా.. 8 మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు.