C Narasimha Rao Passes Away: ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకులు సి. నరసింహారావు కన్నుమూత, సంతాపం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
సి.నరసింహారావు (Image Source : Twitter)

హైదరాబాద్, మే 12: ప్రముఖ రచయిత, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి. నరసింహారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్థరాత్రి (తెల్లవారితే గురువారం) 1.50 గంటల సమయంలో మరణించారు. నరసింహారావు 29 డిసెంబరు 1948లో కృష్ణాజిల్లాలోని పెదపాలపర్రు గ్రామంలో జన్మించారు.

వ్యక్తిత్వ వికాసం ఎన్నో పుస్తకాలు రచించి, రచయితగా కీర్తి గడించారు. సి. నరసింహారావు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Telangana: తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారింది, రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించడం చిన్న విషయం కాదని తెలిపిన మంత్రి హరీష్ రావు 

సి.నరసింహారావు మృతి పట్ల టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంతాపం ప్రకటించారు. "ప్రముఖ రచయిత, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు గారి మరణం విచారకరం. వ్యక్తిత్వ వికాసం పై ఆయన రాసిన అనేక పుస్తకాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. నరసింహారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు నరసింహారావు మృతి బాధాకరమన్నారు అచ్చెన్నాయుడు. ప్రజల పక్షాన మాట్లాడే ప్రజాగొంతుక మూగబోయిందన్నారు. సమకాలీన రాజకీయ విశ్లేషణలో నరసింహారావు తనదైన ముద్ర వేశారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిర్ద్వందంగా ఖండించిన వ్యక్తి నరసింహారావు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని, కుటుంబ సభ్యులకు, మిత్రులకు భగవంతుడు మనోధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.