CM KCR & Health Minister Etala Rajender | File Photo

Hyderabad, March 24: స్టేట్ లాక్ డౌన్ (Telangana Lockdown) నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) మంగళవారం మరోసారి రాష్ట్ర స్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్ లో కొనసాగుతున్న సమావేశంలో వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus Outbreak) చెందకుండా తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని సీఎం చర్చిస్తున్నారు.

కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే లాక్ డౌన్ పై కఠిన నిర్ణయాలు అధికారులు తీసుకున్నారు. ఈ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయాలన్నీ క్షేత్ర స్థాయిలో కట్టుదిట్టంగా అమలు జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం దిశానిర్ధేషం చేయనున్నట్లు సమాచారం. అనంతరం మీడియా ముఖంగా ముఖ్యమంత్రి ప్రజలకు తెలియజేస్తారు. తెలంగాణలో ఇంటింటి హెల్త్ సర్వే చేపట్టనున్న ప్రభుత్వం, విదేశాల నుంచి వచ్చిన వారిపై ఇంటెలిజెన్స్ నిఘా

 

ఇదిలా ఉండగా, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రగతి భవన్ లో ప్రత్యేక హ్యాండ్ వాషింగ్ కార్యక్రమం చేపట్టారు. వివిధ కార్యక్రమాల కోసం సీఎంను కలవడానికి ప్రగతి భవన్ లోకి వచ్చే ముంది చేతులు కడుక్కోవడానికి రెండు పెద్ద గంగాళాల్లో నీటిని ఉంచారు. మంత్రులు, ఉన్నతాధికారులు తదితరులెవరైనా సీఎం కార్యాలయంలోకి వచ్చే ముందే అక్కడ చేతులు కడుక్కుని, శానిటైజర్ తో శుభ్రపరుచుకురావాలనే నిబంధన పెట్టారు.

Ministers & senior officials sanitizing their hands before attending the review meeting with CM

దీంతో మంగళవారం నాటి అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రులు, ఇతర అధికారులు బయటే నీళ్లు, సబ్బుతో చేతులు కడుక్కొని లోపలికి ప్రవేశించారు. ప్రతీ ఇంట్లో, ప్రతీ కార్యాలయంలో కూడా ఇలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కార్యాలయం సూచించింది.

ఇప్పటికే రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరింది. మంగళవారం కొత్తగా మరో 3 కేసులు నమోదయ్యాయి. లండన్ నుంచి కూకట్ పల్లి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి, జర్మనీ నుంచి చందానగర్ వచ్చిన 39 ఏళ్ల మహిళకు, సౌదీ నుంచి బేగంపేట వచ్చిన 61 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.