Hyderabad, December 30: కొంతకాలంగా హైదరాబాద్ (Hyderabad) నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) కు చెందిన ఏడుగురు సభ్యుల సంచారజాతి దోపీడీ దొంగల ముఠాను రాచకొండ పోలీసులు (Rachakonda Police) హయత్ నగర్ లో పట్టుకున్నారు.
వీరిపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 8 కేసులు నమోదై ఉన్నాయి. వీరి నుంచి రూ. 6.5 లక్షల విలువైన బంగారం, వెండి మరియు ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠాలోని సభ్యులను చౌహన్ తారా సింగ్, మొహద్ సోను, బిట్టు, గుఫ్తాన్, సైఫ్ అలీ, సాదిక్ మరియు మొహద్ సజీద్లుగా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం, సంచార వర్గానికి చెందిన ఈ ముఠా సభ్యులు కొన్ని దశాబ్దాల కిందటే బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గుండా మన దేశంలోకి చొరబడ్డారు. అప్పట్నించీ ఒక గ్యాంగ్ గా సంచరిస్తూ వివిధ రాష్ట్రాల్లో అనేక దోపిడీలకు పాల్పడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోకి చొరబడిన ముఠా, హైదరాబాద్ నగర శివార్ల ఒంటరిగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇళ్లలోకి చొరబడి ఇంటి సభ్యులను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి ఉన్నదంతా దోచుకొని అక్కడ్నించి ఉడాయించడం వీరి పని అని పోలీసులు వెల్లడించారు.
గడిచిన నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్ పరిధిలో ఆరు చోట్ల దోపిడీలు జరిగాయి. వీరి భయంతో నగర శివారు ప్రజలు భయంభయంగా రోజులు గడుపుతున్నారు. అయితే ఎట్టకేలకు పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే చడ్డీలు వేసుకొని తిరుగుతుండటంతో పోలీసులు వీరిని మొదట 'చడ్డీ గ్యాంగ్' గా అనుమానించారు. అయితే వీరికి చడ్డీ గ్యాంగ్ (Chaddi Gang) తో సంబంధం లేదని ఆ తరువాత విచారణలో నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.