Hyderabad, OCT 06: తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ (IMD). రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వానలు (Heavy rains) పడతాయంది. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy rains) పడతాయని వెల్లడించింది. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుందని హెచ్చరించింది. పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఈ వర్షాలకు కారణమని వెల్లడించింది. హైదరాబాద్ (Hyderabad)తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచే వానలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వాన పడింది. ఉప్పల్ (Uappal), పీర్జాదిగూడ, తార్నాక తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పలు కాలనీల్లో రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.
హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. మరోసారి కుండపోత వర్షం పడింది. బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో.. ఉరుములు మెరుపులతో భారీ వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, యూసఫ్‌గూడ్, కూకట్‌పల్లి.. ఇలా చాలా చోట్ల భారీ వర్షం పడింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించడం.. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఈ ప్రభావం కొనసాగవచ్చని తెలుస్తోంది.