Hyderabad, Sep 16: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్టం అత్యంత ప్రమాదకరమని (CM KCR on New Electricity Bill) తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో (Electricity Amendment Bill 2020) విద్యుత్‌పై రాష్ట్రాలకున్న అధికారం పోతుందని, విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తారని హెచ్చరించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం సవరణ బిల్లుపై అసెంబ్లీలో మంగళవారం స్వల్పకాలిక చర్చలో (Telangana Monsoon 2020) సీఎం కేసీఆర్ మాట్లాడారు.
త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే పేద ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు, విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వాల అధికారం శూన్యమవుతుందని వ్యాఖ్యానించారు. విద్యుత్ పంపిణీలో ఇప్పటి వరకు అమలు చేసిన రాయితీ పథకాలన్నీ హరించుకుపోతాయని, ముఖ్యంగా రైతులకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకం ఉండదన్నారు. రైతులు వేసిన ప్రతి బోరుకు మీటర్లు బిగించక తప్పదని, అదేవిధంగా వినియోగించిన విద్యుత్‌కు తప్పనిసరిగా బిల్లు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు.
రైతు రక్షణే తమ ధ్యేయమని తెలిపిన సీఎం కేసీఆర్, 8 కీలక బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
ఒక రకంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టం 2003 సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీలో దీనిపై వాడివేడి చర్చ జరిగింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలకు సీఎం సమాధానం ఇవ్వాలని కోరడంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (Telangana CM KCR) నూతన విద్యుత్ చట్టం–2003 సవరణ బిల్లులోని అంశాలను సభకు వివరించారు.
దేశంలో మిగులు విద్యుత్ ఉన్నా అనేక ప్రాంతాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయని..ఈ బిల్లుతో రైతులు, పేదలు, విద్యుత్ ఉద్యోగులు.. ఇలా అన్నివర్గాల వారు నష్టపోతారని వివరించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ రైతాంగంపై ఇది పిడుగులాంటిదేనని సీఎం తెలిపారు. కేంద్రంలోని వరుస ప్రభుత్వాలు దేశంలో వృథా అవుతున్న నీటిని వినియోగించే ప్రణాళికలు రూపొందించలేదని, కానీ రాష్ర్టాల అధికారాలను హరించేందుకు ప్రయత్నించాయని విమర్శించారు. నిండు సభ నుంచి ప్రధాన మోదీని రెండు చేతులు జోడించి.. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని వేడుకుంటున్నా.. అని చెప్పారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
కేంద్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తేవాలని యోచిస్తున్న నూతన విద్యుత్ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పలు సందేహాలకు తావిస్తుందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. నూతన చట్టం అమల్లోకి వస్తే రాయితీలు ఇచ్చే అవకాశం ఉండదని మంత్రి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తామంటే కేంద్రం ఎందుకు వద్దంటుందని ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం- 2003 సవరణ బిల్లుపై మరింత లోతైన సమాచారం ఇస్తే తమ అభిప్రాయాలను చెబుతామన్నారు. ప్రభుత్వాలు ఏ చట్టం చేసినా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని హితవు పలికారు.