High Court of Telangana | TSRTC Strike | File Photo

Hyderabad, November 7:  తెలంగాణ ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) మరియు ఆర్టీసీకి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల చిక్కుముడి వీడటం లేదు, ఇప్పటికే  హైకోర్టు (High Court of Telangana) లో పలుమార్లు విచారణకు వస్తూ, వాయిదా పడుతున్న ఈ కేసు, ఇప్పటికీ ఎక్కడ మొదలైందో అక్కడే ఉంది. గురువారం మరోసారి విచారించిన ధర్మాసనం ప్రభుత్వం మరియు ఆర్టీసీ సంస్థ సమర్పించిన అఫిడవిట్లపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. లెక్కల్లో తేడాలుండటంతో మరోసారి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.

ఈరోజు విచారణ సందర్భంగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదిక, ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన నివేదిక రెండూ వేర్వేరుగా ఉన్నాయి, ఇందులో వేటిని పరిగణించాలి అని ప్రశ్నించింది. ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా కోర్టుకు అస్పష్టంగా ఉన్న నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. ఇవే లెక్కలతో అటు మంత్రిని, సీఎంను, ప్రభుత్వాన్ని మరియు ప్రజలను తప్పుదోవ పట్టించారా అని అధికారులపై హైకోర్ట్ తీవ్రస్థాయిలో మండిపడింది.

తాము ఆర్టీసీ యాజమాన్యానికి మరియు కార్మికులకు మధ్య సయోధ్య కుదిర్చాలన్న ప్రయత్నం చేస్తుంటే, ఆర్టీసీ యజమాన్యం మరియు ప్రభుత్వంలో అలాంటి చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం కొంత మానవతా దృక్పథంతో ఆలోచించి, ప్రజల కోసం తన స్టాండ్ మార్చుకోవాలని హైకోర్ట్ సూచించింది. ఈ నేపథ్యంలో విచారణ మరోసారి వాయిదాపడింది.

గమనిక: ఇక్కడ ప్రభుత్వానికి హైకోర్ట్ సూచన మాత్రమే చేసింది, ఆదేశించలేదు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా ఒక సందర్భంలో ప్రస్తావిస్తూ, తమ విధానపరమైన నిర్ణయాలను మార్చుకోమని చెప్పేందుకు హైకోర్టుకు అధికారం లేదని అన్నారు.

34వ రోజుకు చేరిన సమ్మె, విధుల్లో చేరిన వారిపై 'నమ్మక ద్రోహం' సెగ

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి నేటికి 34 రోజులు అవుతుంది. అక్టోబర్ 5నుంచి సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గురువారం రోజు కూడా అఖిల పక్షం నాయకులు, పలు విద్యార్థి సంఘాలతో కలిసి ఆర్టీసీ కార్మికులంతా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరియు సీఎం కేసీఆర్ (CM KCR) కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అలాగే ఇటీవల సీఎం పిలుపుతో కొంత మంది విధుల్లో చేరిన కార్మికుల పట్ల సహచర కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంతా 'ఉద్యమ ద్రోహులు' అని విధుల్లో చేరిన వారి ఫోటోలను బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు.

తామంతా ఆకలిబాధలతో సమ్మె చేస్తుంటే నమ్మక ద్రోహం చేస్తారా అంటూ వారి ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ, చెప్పుల దండలు వేస్తూ ఊరేగించారు. వీటిని గమనించిన పోలీసులు ఆ ఫ్లెక్సీలను తొలగించారు.