
Hyderabad, Nov 13: తెలంగాణలో (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ (Nominations) లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్ లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,798 నామినేషన్ లు దాఖలయ్యాయి. ఈ మొత్తం నామినేషన్ ల పరిశీలన అనంతరం నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని అధికారులు తిరస్కరించనున్నారు. తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకేరోజు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.
ఉపసంహరణకు తుది గడువు అప్పుడే
ఈ నెల 15 వరకు నామినేషన్ ల ఉపసంహరణకు తుది గడువు ఉన్నది. కాబట్టి పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థు ఆరోజు వరకు తమ నామినేషన్ లను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నది. ఈ నామినేషన్ ఉపసంహరణ కూడా పూర్తయితే ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది కచ్చితంగా తేలనుంది.