Hyderabad, May 8: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (AbdullapurMate Road Accident) చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఓ లారీని స్విఫ్ట్ కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ సుల్తాన్ బజార్ సీఐ ఎస్. లక్ష్మణ్ (Sultan Bazar CI Lakshman), ఆయన భార్య ఝాన్సి అక్కడికక్కడే మృతి చెందారు.
సూర్యాపేట నుండి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో సీఐ భార్య ఝాన్సి కారును నడిపినట్లు సమాచారం. దంపతులతో పాటు ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలుడు గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్‌లో ఇసుక లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. స్థానికుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాళేశ్వరం నుంచి ఇసుక లోడుతో వస్తున్న లారీ జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్ వద్ద మోటర్ సైకిల్ పై వస్తున్న వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి పోలీసులు వెంటనే స్పందించారు. ఎస్‌ఐ అభినవ్ సంఘటన స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరిలో నీటమునిగి ఇద్దరు మృతి చెందారు. పట్టణం లోని కొత్త కాలనీకి చెందిన స్వాతి శుక్రవారం బట్టలు ఉతికేందుకు గోదావరికి వెళ్లారు. కూతురు మధు, మేనకోడలు ప్రవళిక కూడా ఆమెతోపాటు వెళ్లారు. అయితే స్వాతి బట్టలు ఉతుకుతున్న క్రమంలో మధు, ప్రవళిక గోదావరి నీటిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు.