Hyd, Jul 16: తెలంగాణ రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో మాట్లాడిన రేవంత్...18 సాయంత్రంలోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు.
రుణమాఫీకీ రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీఇచ్చారు సీఎం రేవంత్. రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన అని చెప్పారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేస్తే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ నెల 18న రైతు వేదిక ల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తామని రేవంత్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు,ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందేది. కానీ ఇకపై రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని వెల్లడించారు.
ఈ సదస్సుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషన్లర్లు, ఎస్పీలు హాజరుకాగా ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం- సీజనల్ వ్యాధులు,
వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపై కులంకశంగా చర్చించారు సీఎం రేవంత్. అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వానికి - ప్రజలకు అధికారులే వారధి అని కాబట్టి బాధ్యతతో పనిచేయాలని సూచించారు.