Hyderabad, November 26: ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై టీజేఎస్ (Telangana Jana Samithi) నేత విశ్వేశ్వరావు వేసిన పిటిషన్ ఈరోజు హైకోర్టు (High Court of Telangana) లో విచారణకు వచ్చింది. ఈ సమ్మె ద్వారా దాదాపు 30 మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణమయిందని పిటిషనర్ వాదనలు వినిపించారు. సమ్మె విరమించి విధుల్లోకి చేరేందుకు వస్తున్న కార్మికులను అడ్డుకుంటుండటంతో కొంతమంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే మరిన్ని కార్మికుల మరణాలు పెరుగుతాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.
దీనిపై స్పందించిన హైకోర్ట్ ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించాలని పిటిషనర్ ను ప్రశ్నించింది. సమ్మెకు పిలుపునిచ్చింది ఆర్టీసీ యూనియన్లు కాబట్టి వారి ఆత్మహత్యలకు యూనియన్ నేతలే బాధ్యులంటూ హైకోర్ట్ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తీరుతోనే ఆత్మహత్య చేసుకుంటున్నామని చెబుతూ పలువురు కార్మికులు రాసిన సూసైడ్ లెటర్లను పిటిషనర్ ధర్మాసనం ముందుంచారు. అయినప్పటికీ పిటిషనర్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించలేదు. చనిపోయిన వారందరూ ప్రభుత్వ తీరుతోనే చనిపోయారనడానికి ఆధారాలేంటి? అని హైకోర్ట్ ప్రశ్నించింది. గుండెపోటు రావటానికీ ఎన్నో కారణాలు ఉంటాయని తెలిపిది.
కార్మికుల ఆత్మహత్యలకు యూనియన్ నేతలదే బాధ్యత అని స్పష్టంచేసింది.
ఇక కార్మికులను ప్రభుత్వం 'డిస్మిస్' చేయలేదని హైకోర్ట్ పేర్కొంది. అలాగే కార్మికులను విధుల్లోకి చేర్చుకునే అంశంలో తాము జోక్యం చేసుకోలేమని, ప్రభుత్వానికి తాము ఆదేశాలివ్వలేమని తెలిపింది. డిపోల్లోకి కార్మికులను అనుమతించకపోతే అందుకనుగుణంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మున్సిపల్ ఎన్నికల అంశాన్ని కూడా అదే రోజుకు వాయిదా వేసింది.
ఈరోజు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఘటనలు
సమ్మె విరమించిన తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఎక్కడిక్కడ, ఎప్పటికప్పుడు అరెస్టులూ కొనసాగుతున్నాయి.
కార్మిక సంఘాలకు సమ్మె నోటీసు ఇచ్చే హక్కు ఉంది. ఆర్టీసీ సంస్థను రక్షించుకునేందుకే సమ్మెకు వెళ్లాం, విధుల్లో చేరేందుకు వస్తున్న కార్మికుల అరెస్టులను ఖండిస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ అత్యవసరంగా రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
బంజారాహిల్స్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం
ఇక ఈరోజు బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ వద్ద, ఓ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీపై దూసుకెళ్లాడు. ఈ ఘటనలో టీసీఎస్ (TCS) కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేసే సోహిని సక్సేనా (Sohini Saxena) అనే మహిళ దుర్మరణం చెందింది. దీంతో ఆగ్రహించిన తోటి ప్రయాణికులు, స్థానికులు డ్రైవర్ ను చితకబాదారు. ఘటనా స్థలం వద్ద సెల్ఫీకి ప్రయత్నించిన మరో యువకుడికి కూడా దెబ్బలు పడ్డాయి. భార్య మృతితో ఆమె భర్త గుండెలు పగిలేలా రోదించడం అక్కడున్నవారిని కలిచి వేసింది. కాగా, ఈ ప్రమాదం పట్ల అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగటం దురదృష్టకరమని తెలిపారు. బాధ్యుడైన డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.