Hyderabad,June 15: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏడో దశ రైతు బంధు ప్రారంభం కానుంది. జూన్ 15 నుండి ఈనెల 25 వరకు రైతుల ఖాతాలకు ప్రభుత్వం (TS Govt) డబ్బులు వేయనుంది. రాష్ట్రంలోని 63,25,695 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు బంధు (Rythu Bandhu aid starts from today) జమకానుంది. ఇందుకోసం రూ. 7,508 కోట్ల రూపాయలను తెలంగాణ సర్కార్ ఖర్చు చేయనుంది.
గత యాసంగీతో పోలిస్తే ఈసారి అదనంగా మరో రెండు లక్షల మందికి అదనంగా రైతు బంధు (Rythu Bandhu) ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ విస్తీర్ణం పెరగడం వల్ల మరో 66 వేల ఎకరాలకు పైగా రైతుబంధు (Rythu Bandhu Scheme) వర్తించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన నిధులను సమకూర్చింది. గత యాసంగితో పోల్చితే ఈ సీజన్‌లో 2,81,865 మంది రైతులు కొత్తగా రైతుబంధుకు అర్హత సాధించారు.
అంతేకాకుండా 66,311 ఎకరాలు భూమి పెరగింది. ఈ సీజన్‌లో నల్లగొండలో ఎక్కువ మంది రైతులకు రైతుబంధు అందనుండగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లాలో 4,72,983 మంది అర్హులైన రైతులు ఉండగా వీరికి 12.18 లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఈ ఒక్క జిల్లాకే ఏకంగా రూ.608.81 కోట్లు అందనున్నాయి. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 77 వేల ఎకరాలున్న 39,762 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ. 38.39 కోట్లు అందనున్నాయి.
రైతుబంధు పంపిణీని క్రమబద్ధంగాచేయాలని అధికారులు నిర్ణయించారు. ఎకరం భూమి గల రైతులకు తొలిరోజు (మంగళవారం) రైతుబంధు నిధులు విడుదల చేస్తారు. ఆ తర్వాత రెండెకరాల భూమి గల రైతులకు ఇస్తారు. 25వ తేదీ వరకు అర్హులైన ప్రతిరైతుకు రైతుబంధు అందిస్తారు. ఈ సీజన్‌తో కలిపి ఇప్పటి వరకు ఏడు దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయం అందించారు.