Hyd, Jan 13:హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ పరిధిలో పార్శిల్ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్‌పై (Swiggy food delivery boy) పెంపుడు కుక్క దాడి చేయడంతో మూడో అంతస్తు నుంచి (jumps off third floor) కిందకు దూకాడు.తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 6లోని లుంబిని ర్యాక్ క్యాజిల్ అపార్ట్‌మెంట్‌లో నివసించే శోభనా నాగాని ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేశారు.
ఈ నెల 11న ఉదయం 9 గంటల ప్రాంతంలో మహ్మద్ రిజ్వాన్(23) స్విగ్గి డెలివరీ బాయ్ పార్శిల్ ఇవ్వడానికి వెళ్లి తలుపు కొట్టాడు.తలుపు తీసి ఉండటంతో ఒక్కసారిగా ఇంట్లోనుంచి జర్మన్ షెపర్డ్ కుక్క బయటికి దూసుకొచ్చి అతడిని కరవబోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రిజ్వాన్ కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు పరుగు పెట్టాడు. అతడి వెంట కుక్క పడడంతో మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకాడు. కారిడార్ రెయిలింగ్ నుంచి జారి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
యజమానురాలు కుక్కను కట్టకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడంతోనే తమ సోదరుడు తీవ్ర గాయాలపాలయ్యాడని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి సోదరుడు ఖాజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శోభనపై ఐపీసీ సెక్షన్ 336, 289 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.