Secunderabad Fire MIshap: రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు తొలగించడం సాధ్యం కాదు,మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు, డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు
Telangana Minister Talasani Srinivas Yadav (photo-ANI)

Hyd, Jan 20: సికింద్రాబాద్ డెక్కన్ మాల్‌ అగ్నిప్రమాదంపై కేసు నమోదు (Deccan mall owner for fire mishap) చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ రాజేష్‌ చంద్ర మీడియాకు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం (Secunderabad Fire MIshap) జరిగిన తీరును వివరించారు.మొదటగా సెల్లార్‌లో ప్రమాదం జరిగింది. పొగలు వస్తున్న సమయంలో ఏడుగురు సెల్లార్‌లోనే ఉన్నారు. ఆ పొగను చూసి కార్మికులంతా బయటకు వచ్చారు. అయితే.. ఫస్ట్‌ ఫ్లోర్‌లో స్పోర్ట్స్‌ మెటీరియల్‌ గోదాం ఉంది. ఆ మెటీరియల్‌ దించేందుకు ముగ్గురు కార్మికుల్ని యజమాని పైకి పంపించారు.

ఆ ప్రయత్నంలో వాళ్లు ఉండగానే.. పొగలు, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. అలా ఆ ముగ్గురు ఫస్ట్‌ ఫ్లోర్‌లోనే చిక్కుకున్నారు. ఆ ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయి ఉన్నాయి. భవనంలోని మెట్ల మార్గం పూర్తిగా కూలిపోయింది. క్రేన్‌ల సాయంతో భవనం పరిస్థితిని సమీక్షిస్తున్నాం అని డీసీపీ రాజేష్‌ మీడియాకు తెలిపారు. ఇక.. డెక్కన్‌ మాల్‌ బిల్డింగ్ కూల్చే వరకు చుట్టుపక్కల ఇళ్లలోకి ఎవరిని అనుమతించమన్న ఆయన.. లోపల డెడ్ బాడీ ఆనవాళ్లు గుర్తించేందుకు డ్రోన్ కెమెరా వినియోగిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్ వెనుక భాగం పూర్తిగా దెబ్బ తింది. బిల్డింగ్ లోపలకి వెళ్ళే పరిస్థితి లేదు. చుట్టూ పక్కల వారికి ఎలాంటి హాని కలగకుండా డిమాలిషన్ ఏర్పాట్లు చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన బిల్డింగ్ యజమాని పై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన మీడియాకు తెలిపారు.

డెక్కన్ స్టోర్‌ ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు, ఆందోళన కలిగిస్తున్న బిల్డింగ్ లోపలపేలుడు శబ్దాలు, దాదాపు 4 గంటలకు పైగా సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులోని షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదని విద్యుత్‌ శాఖ అధికారి శ్రీధర్‌ తెలిపారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో కొద్ది మీటర్ల దూరంలో విద్యుత్‌ సరఫరా ఉందన్నారు. ఒకవేళ షార్ట్‌ సర్య్కూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్‌లో ట్రిప్‌ అయ్యేదని.. కానీ అలా జరగలేదని ఆయన వివరించారు. గురువారం ఉదయం 11.20 గంటలకు సమాచారం అందగానే విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, వైర్లు పూర్తిగా కాలిపోయేవని చెప్పారు. భవనానికి మొత్తం 6 మీటర్లు ఉన్నాయన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలేంటనేది దర్యాప్తులో తేలుతుందని శ్రీధర్‌ చెప్పారు.

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం, మొదటి అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్టుగా వార్తలు, కొనసాగుతున్న సహాయక చర్యలు

భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో స్వల్పంగా ఉన్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో భవనం పూర్తిగా దెబ్బతింది. భవనం లోపలి పరిస్థితిని అంచనా వేయడానికి అగ్నిమాపక శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు డ్రోన్‌ ఉపయోగించారు. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో 17 మంది ఉన్నారని.. మంటలు వ్యాపించడాన్ని గుర్తించి వీరంతా ముందుగా బయటకు వచ్చారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

దుకాణంలో ఉన్న సామాను తీసుకురావడానికి మళ్లీ లోపలికి వెళ్లి ముగ్గురు చిక్కుకుపోయారని తెలిపాయి. గుజరాత్‌లోని సోమనాథ్ జిల్లా వెరావల్ గ్రామానికి చెందిన గ్రామస్థులు జునైద్(25), జహీర్(22), వసీం(32)గా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ముగ్గురి పరిస్థితి గురించి కూడా అధికారులు డ్రోన్‌ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన భవనం యజమాని జావేద్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం.

డెక్కన్‌ మాల్‌ అగ్ని ప్రమాదం నేపథ్యంలో నగరంలో అక్రమ నిర్మాణాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. డెక్కన్‌ మాల్‌ భవనంలో కెమికల్స్‌ వల్ల మంటలు ఆరలేదు. హైదరాబాద్‌లో డెక్కన్‌ మాల్‌ వంటి భవనాలు 25వేల వరకు ఉండొచ్చు. అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదు. ఇలాంటి కట్టడాల విషయంలో ఏం చేయాలనే దానిపై కమిటీ వేశాము.

ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి గాలిమాటలు మాట్లాడుతున్నారు. భవనాల క్రమబద్దీకరణపై స్టే ఉందని కిషన్‌ రెడ్డికి తెలియదా?. గుజరాత్‌లో కూడా వంతెన కూలి 180 మంది మరణించారు. కిషన్ రెడ్డి లాగా మేము రాజకీయాలు చేశామా?. హైదరాబాద్ అభివృద్ధికి గత ఎనిమిదేళ్లలో 65 వేల కోట్ల రూపాయలు కేటాయించాము. ఇంత అభివృద్ధి గతంలో ఎపుడైనా జరిగిందా?. రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదు. బాధితులను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమా లేక కేంద్ర ప్రభుత్వ అధికారులా?. కిషన్ రెడ్డి భాద్యత లేకుండా మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు.

మా ప్రభుత్వంలో ఒక్క భవనాన్ని కూడా రెగ్యులరైజ్‌ చేయలేదు. అగ్ని ప్రమాదం కారణంగా పక్కన ఉన్న బస్తీ వాసులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నాము. బాధితులను కాపాడే క్రమంలో అగ్ని మాపక సిబ్బంది​కి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కట్టడం నాణ్యతపై నిట్‌ ఆధ్వర్యంలోని కమిటీ తన నివేదికని త్వరలోనే సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాము’ అని స్పష్టం చేశారు.