Agnipath Protest (Credits: ANI)

Hyd, June 23: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో (Agnipath Protest) తాజాగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విధ్వంసం రోజున ఉప్పల్‌ అకాడమీలో ఆవుల సుబ్బారావు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ అయిన ఆవుల సుబ్బారావు, శివ ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. వీరు హకీంపేట సోల్జర్స్‌ గ్రూపులో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్ట్‌లు పెట్టినట్లుగా గుర్తించారు. అగ్నిపథ్ ఆందోళనకు (Secunderabad Railway Station violence) కావాల్సిన లాజిస్టిక్స్‌ సమాకూర్చినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపారు.

ఈ విధ్వంసం కేసులో కీలక నిందితులతో సుబ్బారావు ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. కేసులో A2గా ఉన్న పృధ్విరాజ్‌ కూడా సాయి డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థిగా గుర్తించారు. నరసారావుపేటలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఆర్మీ కోచింగ్‌ ఇస్తున్నారు. కాగా సికింద్రాబాద్ విధ్వంసంలో పలువురు సాయి డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థులు కీలకంగా వ్యవహరించారు. ఇప్పటివరకు 63 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 55 మందిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. మరో ఎనిమిది మంది.. A7, A8, A9, A10, A11, A12, A62, A63 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు.

అప్పుడు రైళ్లను తగలబెట్టారు..ఇప్పుడు భయపడుతున్నారు, అరెస్టు చేస్తారనే భయంతో ఒకరు ఆత్మాహత్యాయత్నం, విధ్వంసం కేసులో నిందితులకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు

ఇప్పటికే 28 మంది ఆందోళనకారులు చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి బుధవారం మరో 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరిలో పృథ్వీ రాథోడ్, బింగి రమేష్, రాజా సురేంద్రకుమార్, దేవోసత్‌ సంతోష్, ఎండీ సాబేర్, పద్వల్‌ యోగేష్, బమన్‌ పరశురాం, పుప్పాల అయ్యప్ప చారీ, పసునూరి శివసుందర్, సురనర్‌ తుకారామ్‌ ఉన్నారు.