Hyderabad December 05: అప్పుల పేరుతో సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలను కోట్ల రూపాయలు మోసం చేసిందని ఆరోపణలు ఎదుర్కుంటున్న శిల్పాచౌదరి (Shilpa chowdary) కేసులో ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. శిల్ప వసూలు చేసిన డబ్బులను ఏం చేసిందనే కోణంలో ఇంటరాగేషన్ చేసిన పోలీసులకు(Police) పలు కీలక విషయాలు చెప్పింది. రాధికారెడ్డి(Radhika Reddy) అనే మహిళ తనను మోసం చేసిందని, రూ. 10 వడ్డీకి తన దగ్గర దాదాపు 6కోట్లు తీసుకుందని తెలిపింది. దాంతో పాటూ తన డబ్బులన్నీ పలు ఇన్వెస్ట్‌మెంట్ రంగాల్లో పెట్టినట్లు చెప్పింది. రియల్ ఎస్టేట్(Real Estate), ఆస్పత్రులు, సినిమా హాళ్ల నిర్మాణాల్లో తన డబ్బులు నిలిచిపోయాయని, తాను ఎవరినీ మోసం చేయాలని అనుకోవడం లేదని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.

శిల్పాచౌదరి(Shilpa Chowdary) ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా రియల్ ఎస్టేట్ తోపాటు ఈవెంట్ మేనేజ్మెంట్ నడుపుతున్న టంగుటూరు రాధికా రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. తన దగ్గర ఆరు రూపాయల వడ్డీకి రాధికారెడ్డి ఆరు కోట్లు తీసుకుందని విచారణలో శిల్ప వెల్లడించింది. టంగుటూరు రాధికా రెడ్డి జన్వాడలో నివాసముంటోంది. ఫ్లోరిస్ట్ గా ఈవెంట్స్ చేస్తున్న రాధికా రెడ్డి రూ.10 రూపాయల వడ్డీతో కోట్ల రూపాయల తీసుకున్నట్లు శిల్ప తెలిపింది. దీంతో రాధికారెడ్డిని విచారణకు పిలవాలని పోలీసులు భావిస్తున్నారు.

Shilpa Chowdary Arrest: అధిక వడ్డీ పేరుతో ముగ్గురు టాలీవుడ్ హీరోలను బురిడీ కొట్టిన కిలాడీ, కిట్టీ పార్టీలు, పేజ్‌ త్రీ పార్టీలతో కోటీశ్వరులకు దగ్గరైన శిల్పా చౌదరి, రూ.200 కోట్ల వరకు వసూలు చేసినట్లు అనుమానం

తన స్థాయిని పెంచుకునేందుకు శిల్ప రకరకాలుగా ప్రయత్నాలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. బిల్డప్‌ కోసం… స్టేటస్‌ సింబల్‌గా బౌన్సర్లను నియమించుకున్నట్టు చెప్పింది. అంతేకాదు ఆమె రెండేళ్లు అమెరికాలో ఉండి వచ్చినట్లు తేలింది. అయితే.. శిల్పా ఎందుకు వెళ్లారు.. ఎవరెవరు వెళ్లారు.. అక్కడ కూడా డీలింగ్స్‌ చేశారా.. అనే కోణంలోను ఇప్పుడు పోలీసులు ఫోకస్‌ చేస్తున్నారు.

శిల్పా చౌదరి పోలీస్ కస్టడీ ముగిసింది. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి..స్టేట్‌మెంట్ సమర్పించారు పోలీసులు. తర్వాత చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. ఈ ఘరానామోసం కేసులో టంగుటూరి రాధికారెడ్డి ఎంట్రీ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

సెహరి(Sehari) చిత్ర నిర్మాణంలో శిల్ప 12శాతం పెట్టుబడి పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. గండిపేట సిగ్నేచర్‌ విల్లాలోని శిల్ప ఇంటికి ఆమెను తీసుకెళ్లి సోదాలు నిర్వహించిన పోలీసులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్దేశం తనకు లేదని పోలీసుల ఎదుట శిల్ప వాపోయినట్టు సమాచారం.

లెక్కల్లో చూపని నల్లడబ్బును మార్చేందుకు ఇతరులు శిల్పాచౌదరి ద్వారా వ్యాపారం నిర్వహించాలని భావించారా! అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. నిందితుల బ్యాంకు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏడాది కాలంలో జరిపిన ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు.