Peddapalli, DEC 27: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల (Singareni Election) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. ఎన్నికల (Singareni Election) బరిలో మొత్తం 13 కార్మిక సంఘాలు నిలిచాయి. పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 11 డివిజన్ లలో నిర్వహించే ఎన్నికలకు 84 పోలింగ్ కేంద్రాలను కేంద్ర కార్మిక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. రహస్య బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరుగుతుంది.
ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ (Singareni Election) ప్రక్రియ పటిష్ట భద్రత మధ్య ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దకు బ్యాలెట్ పెట్టెలను తరలించి రాత్రి 7గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తారు. అయితే, పూర్తిస్థాయి ఫలితాలు అర్థరాత్రి తరువాతే వెల్లడికానున్నాయి.
సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో అత్యధికంగా సీపీఐ (CPI) అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ మూడు సార్లు, కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్ టీయూసీ ఒకసారి, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండు సార్లు విజయం సాధించాయి. ఏడోసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీతో పాటు బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ సంఘంతో పాటు మరో పది కార్మిక సంఘాలు గుర్తింపు హోదాకోసం పోటీ పడుతున్నాయి.
గత 20 రోజులుగా కార్మిక సంఘాల నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మి సంఘం ప్రధాన నాయకత్వం ప్రచారానికి దూరంగా ఉండటంతో ద్వితీయశ్రేణి నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, హెచ్ఎంఎస్ సంఘాల నాయకులు తమకున్న క్యాడర్ తో గనుల్లో ప్రచారం నిర్వహించారు. అయితే, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్ సంఘాల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.