Nizamabad, OCT 30: నిజామాబాద్ డిచ్ పల్లిలో (Dichpally) దారుణం వెలుగుచూసింది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని (Six year old girl raped) చిదిమేశాడో కామాంధుడు. వావి వరుసలు మరిచి చిన్నారిపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. మృగాడి చేతిలో బలైన ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే చిన్నారి మృతిని సాధారణ మృతిగా నమ్మించే ప్రయత్నం చేశాడు నిందితుడు. పోస్టుమార్టం నివేదికలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన బయటపడింది. అయితే, బాలిక తల్లితో నిందితుడు గోవిందరావు (Govinda Rao) సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న ఘటన జరగ్గా, 23న బాలిక ఆసుపత్రిలో మృతి చెందింది. పోస్టుమార్టం నివేదికతో బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు పోలీసులు. నిందితుడిపై అత్యాచారం, హత్య, పోక్సో సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు గోవిందరావుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలిక తల్లి లావణ్యను బెదిరించాడు గోవిందరావు. పోలీసులు కేసు నమోదు చేస్తే పాపకు పోస్టుమార్టం చేస్తారని, అందుకే సహజ మరణంగా చెప్పి ఆసుపత్రి నుంచి బాలిక (Six year old girl raped ) మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే ఆసుపత్రి సిబ్బంది డిచ్ పల్లి పోలీసులకు ప్రాథమిక సమాచారం అందించారు. దీంతో ఈ నెల 26న ఆ బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టులో బయటపడ్డ విషయాలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. బాలిక తల్లిని ప్రశ్నించారు.
దీంతో అసలు విషయం బయటపడింది. గోవిందరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో మృతి చెందిందని పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మత్తు పదార్దాలకు బానిస అయిన గోవిందరావు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ వెల్లడించారు.