Hyderabad, February 17: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు (Student Suspicious Death). డీమార్ట్ సెక్యూరిటీ (DMart Security) సిబ్బంది కొట్టడంతోనే తమ కొడుకు చనిపోయాడని మృతుడి పేరేంట్స్ ఆరోపిస్తున్నారు.
నివేదికల ప్రకారం స్థానిక శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదివే ల్యావుడా సతీశ్ ఆదివారం సాయంత్రం తన ఇద్దరు స్నేహితులతో కలిసి షాపింగ్ కోసం దగ్గర్లోని డీమార్ట్ హైపర్‌మార్కెట్ కు వెళ్లాడు. అయితే సతీష్ స్టోర్ లోంచి ఒక చాక్లెట్ దొంగలించి బయటకు వెళ్తుండగా డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డాడు. దీంతో దొంగతనం ఎందుకు చేశావ్ అంటూ సెక్యూరిటీ సిబ్బంది నిలదీయడంతో పాటు కొట్టడంతో భయభ్రాంతులకు గురైన సతీశ్ వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అదే క్రమంలో సతీశ్ కు తీవ్రమైన ఫిట్స్ రావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటన సతీశ్ ఇంట్లో విషాదాన్ని నింపింది, డీమార్ట్ సిబ్బంది దాడి వల్లే తమ బిడ్డ చనిపోయాడని వారు ఆరోపిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పేరేంట్స్ కు సమాచారం ఇవ్వకుండానే పిల్లలను బయటకు పంపడంపై కాలేజీ యాజమాన్యాన్ని వారు నిలదీస్తున్నారు.
ఇక దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొన్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. డీమార్ట్ సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు స్టోర్ లోని సిసిటీవి ఫుటేజీని, చుట్టుపక్కల సిసిటీవి ఫుటేజీని పరిశీలిస్తున్నారు.