Supreme Court. (Photo Credits: PTI)

Hyd, April 25: మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ హత్య కేసులో దర్యాప్తు గడువును జూన్‌ 30 వరకు పొడిగించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ గడువు ఏప్రిల్‌ 30కి ముగియాల్సి ఉంది. తాజా ఉత్తర్వులతో సీబీఐకి మరో రెండు నెలల అదనపు గడువు వచ్చినట్టయింది.

దీంతో పాటుగా ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ గురించి ఈ సమయంలో అడగాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయలేదు. ఒక వేళ నిజంగానే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సీబీఐ భావించి ఉంటే.. ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసి ఉండేది. లిఖిత పూర్వకంగా ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వాలన్న హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తున్నామని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.

హైకోర్టులో అవినాష్‌రెడ్డికి ఊరట, ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్‌ చేయొద్దని సీబీఐకి కోర్టు ఆదేశాలు, గంటన్నరకు పైగా సాగిన వాదనలు

కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ వ్యవహారంపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అవినాష్‌ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టింది. అదే సమయంలో అవినాష్‌ ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను నిలిపివేసింది.

తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేసింది.. సీబీఐకి తెలంగాణ హైకోర్టు అలాంటి నిబంధనలను విధించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపైనా ప్రభావం పడుతుందన్న సుప్రీం.. జూన్‌ నెలాఖరు వరకు సీబీఐ దర్యాప్తు గడువును పొడిగించింది. ఇదే సమయంలో ఏప్రిల్ 25న తెలంగాణ హైకోర్టు ముందుకు రానున్న పిటిషన్ లో ముందస్తు బెయిల్ కు సంబంధించి ఎంపీ అవినాష్ తన వాదనలు వినిపించుకోవచ్చని తెలిపింది.

వివేకానందరెడ్డి హత్య కేసు, 2019 నుంచి నేటి వరకు ఏం జరిగింది, నాలుగేళ్లు దాటినా ఇంకా బయటకు రాని అసలు నిజం

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ అధికారులు ఈ నెల 16న నోటీసులు జారీ చేశారు. అక్కడికి రెండు రోజుల వ్యవధిలోనే ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, ఉదయకుమార్‌ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయడంతో.. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 25 వరకు అరెస్ట్‌ చేయవద్దంటూ సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటి వరకు సీబీఐ కార్యాలయంలో ప్రతి రోజూ విచారణకు హాజరుకావాలని అవినాష్‌రెడ్డికి షరతు విధించింది. అవినాష్‌కు ప్రశ్నలను రాతపూర్వకంగా ఇవ్వాలని.. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐకి ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.