Hyd, June 10: డీఎస్సీ ద్వారా త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివి పదోతరగతిలో 10/10 జీపీఎస్ సాధించిన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిభాపురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా వందేమాతరం ఫౌండేషన్‌ను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఇప్పుడు సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌లలో 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివినట్లు సీఎం చెప్పారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్రమంత్రులు కూడా పాఠశాలల్లోనే చదివారన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం రూ.80వేలు ఖర్చు చేస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన, విభజన చట్టంలోని అంశాల అమలు కోసం కృషి చేయాలని పిలుపు
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. స్కూళ్లలో టీచర్లు లేరని విద్యార్థులు రావట్లేదు.. విద్యార్థుల్లేరని బడులు మూసివేస్తున్నారు. ఇది కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లుగా తయారైంది. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే.. విద్యార్థులు రారు.. విద్యార్థులు రావడం లేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలన్నింటినీ మూసివేసే పరిస్థితి కొనసాగింది.
కొన్ని బడుల్లో విద్యార్థుల కన్నా టీచర్ల సంఖ్యే ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే తక్షణమే 11వేల పైచిలుకు పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. సింగిల్ టీచర్ బడుల్ని మూసేయడానికి వీల్లేదని, తండాలు, గూడేల్లో, మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను నిర్వహించడం ద్వారా పేదలు, దళితులు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోనూ మెరుగైన విద్యనందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.