40 students Sick Illness due to food poisoning in Warangal

Warangal, July 17: వరంగల్ జిల్లాలోని బట్టుపల్లి ఎస్సార్‌ప్రైమ్ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో కలకలం రేగింది.బట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ జూనియర్ కళాశాలలో కలుషిత ఆహారం వల్ల 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు ఆదివారం రాత్రి ఎగ్ బిర్యానీతోపాటు చికెన్ వడ్డించారు. ఈ ఆహారం తిన్నతర్వాత ఇంటర్ ఎంపీసీ చదువుతున్న విద్యార్థుల్లో సుమారు 40 మందికి వాంతులు విరోచనాలు అయ్యాయి.

వారిలో సుమారు 20 మందిని వరంగల్ ఉరుసుగుట్ట హంటర్ రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో చేర్చారు. మరికొందరిని హనుమకొండ జయ ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్‌ఛార్జి డిఎంహెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో వైద్య బృందం కళాశాలను సందర్శించి కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్, 40 మంది విద్యార్థులకి వాంతులు విరోచనాలు, నిన్న రాత్రి తిన్న చికెన్ బిరియానే కారణమని అనుమానాలు

కళాశాలలోని విద్యార్థులకు వైద్య చికిత్స అందించారు. అలాగే ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించేలా కడిపి కొండ వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నట్లు డాక్టర్ మదన్ మోహన్ రావు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన వారిలో చాలామంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం ఆరుగురు విద్యార్థినులు మాత్రమే చికిత్స పొందుతున్నారని అన్నారు. వారిని కూడా సాయంత్రంకల్లా డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. ఇంటి దగ్గర నుంచి వచ్చిన తల్లిదండ్రులు అందించిన ఆహారంతో పాటు కళాశాలలో చికెన్, గుడ్డుతో కూడిన ఆహారం భుజించడం వల్లే విద్యార్థులను అస్వస్థతకు గురైనట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే రహస్యంగా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో పేరెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ నిర్వాహకులకు ఫీజుల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పిల్లల ఆరోగ్యం పైన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రతను గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ గుర్తింపు రద్దు చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం నోరు మెదుపకపోగా ఆసుపత్రి వైద్యులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య నిలకడ ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.