Jagtial Road Accident (photo-Video Grab)

Jagtial, Nov 9: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Jagtial Road Accident) జరిగింది. జిల్లాలోని కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని, కారు ఢీ కొట్టడంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో జగిత్యాల ఆస్పత్రికి (Jagtial Hospital) తరలించారు. మృతులు, క్షతగాత్రులు జిల్లాలోని మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో లత ,రమాదేవి, విష్ణు, ఆరు నెలల బాబు ఉన్నారు. శ్రీనివాస్, సృజన్, శ్రుతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆదివారం ఉదయం సారంగపూర్ మండలం పెంబట్ల వెళ్లిన కుటుంబ సభ్యులు, రాత్రి చల్‌గల్ నుంచి మల్లాపూర్ వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల సైనికులు వీర మరణం

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసే క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. మరో ఇద్దరు సైనికులు కూడా అమరులయ్యారు. ముగ్గురు ముష్కరులను జవాన్లు మట్టుబెట్టారు. వీర మరణం పొందిన సైనికుల్లో ఒకరిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్‌ (26) గా, మరో సైనికుడిని ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి (37) గా గుర్తించారు. శనివారం అర్ధరాత్రి ఉగ్రవాదులు మాచిల్‌ సెక్టార్‌ మీదుగా దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. ఉగ్రవాదుల కదలికలను జవాన్లు గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.