COVID-19 Outbreak in India. | PTI Photo

Hyderabad, April 29: సెకండ్ వేవ్ మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది, రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమైనవని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాస రావు అన్నారు. అయితే ప్రజలు తమ బాధ్యతగా, సరైన రీతిలో శుభ్రమైన మాస్కులు ధరించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటి హెల్త్ ప్రోటోకాల్‌లను పాటిస్తే ఈ పరిస్థితిని సులభంగా అధిగమించవచ్చునని ఆయన తెలిపారు. అలాగే ప్రజలందరూ కోవిడ్ నివారణ టీకాలు తీసుకోవడం చాలా ముఖ్యం అని డా. రావు తెలిపారు.

మే 1 నుండి ప్రభుత్వం పెద్ద ఎత్తున టీకా కార్యక్రమాన్ని చేపడుతుంది. ప్రజలు కూడా ముందుకు వచ్చి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే టీకా మాత్రమే కరోనాను అరికట్టడంలో సహాయపడుతుంది. టీకాలు అందరికీ వివిధ దశల్లో ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని డా.శ్రీనివాస రావు తెలిపారు.

ప్రజలు ఇప్పుడున్న పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని వివాహాలు, పండుగలు వంటి వేడుకలను రెండు నెలల పాటు వాయిదా వేయడానికి ముందుకు రావాలని శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే, జూలై చివరి నాటికి పరిస్థితి మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం లాక్డౌన్ విధించే విషయంలో ఎలాంటి ఆలోచనలు చేయడం లేదని, తెలంగాణలో లాక్డౌన్ ఉండబోదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

ఇక, రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 80,181 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 7,994 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 4,725 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,27,960కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,630 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 615 కేసులు, రంగారెడ్డి నుంచి 558 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 58 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,208కు పెరిగింది.

అలాగే బుధవారం సాయంత్రం వరకు మరో 4,009 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,49,692 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 76,060 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

కరోనా నిర్ధారణ అయితే బెంబేలెత్తే అవసరం లేదు.  జ్వరం, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు ఉంటే తప్ప ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అందించే హోం ఐసోలేషన్ కిట్‌లతోనే కోలుకుంటారని డా. శ్రీనివాస రావు తెలిపారు. తెలిపారు.  ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లు వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయవచ్చునని ఆరోగ్యశాఖ హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ నంబర్ 9154170960 ను ద్వారా బాధితులు ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు.