Hyd, Feb 27: వరంగల్ లో మెడికో ప్రీతి ర్యాగింగ్ తో ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరో విద్యార్థిని ర్యాగింగ్ భూతానికి బలైంది. హనుమకొండ జిల్లా రామన్నపేటలో పరిచయమైన వ్యక్తి వేధింపులకు తాళలేక 20 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని (Another engineering student) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థిని జయశంకర్ భూపాలపల్లికి చెందిన రక్షిత, ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లికి చెందిన పబ్బోజు శంకర్, రమాదేవి దంపతుల కూతురు రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ థర్డ్ ఇయర్ చదువుతోంది. పదో తరగతి చదివే రోజుల్లో ఆమెకు పరిచయమైన రాహుల్ అనే యువకుడు ఆమెను గత కొన్నాళ్లుగా వేధింపులకు (ragging in Warangal) గురి చేస్తున్నాడు. తెలుస్తున్నది. గతంలో దిగిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిపింది.
దీంతో వారు భూపాలపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రాహుల్‌ను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు రక్షిత కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తున్నది. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామని, అయితే అతను తన మార్గాన్ని సరిదిద్దుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శివరాత్రికి భూపాలపల్లికి వెళ్లిన రక్షిత.. కాలేజీకి పోతున్నానని చెప్పి ఇంట్లోంచి బయలుదేరింది. కానీ ఆమె కళాశాలకు వెళ్లలేదు. తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత రెండు రోజులకు విద్యార్థిని ఇంటికి తిరిగొచ్చింది. దాంతో కూతురు ఇంటికి తిరిగి వచ్చిందని రక్షిత పేరెంట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా రక్షిత తండ్రి శంకర్ ఆమెను హాస్టల్‌లో నుంచి తీసేసి.. వరంగల్ రామన్నపేటలోని తన సోదరుడి ఇంట్లో పెట్టాడు. అక్కడి నుంచే ఆమె రోజూ కాలేజీకి వెళ్లి వస్తోంది. మిస్సింగ్ కేసుకు సంబంధించి రక్షిత సోమవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉండగా ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది.
దాంతో రాహుల్ అతని స్నేహితుడు యశ్వంత్ వేధింపులతోనే తమ కుమార్తె రక్షిత ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రక్షిత తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి, రక్షిత మొబైల్‌ను స్వాధీనం చేసుకుని, కాల్ డేటా ఆధారంగా రాహుల్, యశ్వంత్‌లను అరెస్టు చేశారు.