YS Sharmila (Photo-Video Grab)

వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి తాము దూరంగా ఉంటున్నామని చెప్పారు.ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులన్నా, కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు... తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని తెలిపారు.

నేటి నుంచి తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, మొత్తం 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎన్నుకోవాలంటూ ఈసీ నోటిఫికేషన్

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నామని... తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని షర్మిల చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని... అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాము నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డకోకూడదనే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. తమ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని కోరారు.