CM Revanth Reddy Slams KCR: కృష్ణా జలాల మీద కేసీఆర్ మరణ శాసనం రాశారు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్, మా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే సూచనలు ఇవ్వండని తెలిపిన ముఖ్యమంత్రి
Revanth Reddy Telangana CM (Photo-Video Grab)

Hyd, Feb 9: అసెంబ్లీలో రెండో రోజు సమావేశాలు (Telangana Assembly Session 2024) హాట్ హాట్ గా సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ (CM Revanth Reddy Slams KCR) నమ్మరా? మీ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు నమ్మడం లేదు... మీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పనుల కోసం నన్ను కలిస్తే ఎందుకు కంగారుపడుతున్నారు? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించారు.

కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల సమస్యలను తన దృష్టికి తీసుకు రావడానికి కలుస్తున్నారని... కానీ వారిని బీఆర్ఎస్ అగ్రనాయకులు అనుమానిస్తున్నారని... అవమానిస్తున్నారని (KCR suspects if MLAs of his party meet me) మండిపడ్డారు. వారి వారి నియోజకవర్గాల కోసం ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా ఎమ్మెల్యేలు తనను కలవవచ్చునని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా అవమానించడం సరికాదన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు వచ్చినా తాను కలుస్తానన్నారు.

తెలంగాణలో గ్రూప్‌-1 అభ్యర్థుల వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు, కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..

త్వరలోనే గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. గ్రూప్-1 అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామన్నారు. కొన్ని నిబంధనల కారణంగా టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైందని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలను నియమించాలంటే నిర్దిష్ట విధానం ఉంటుందని సీఎం రేవంత్ (Revanth Reddy) తెలిపారు. త్వరలోనే పోలీసు శాఖలో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, పోలీసు ఉద్యోగాల కోసం యువత చాలాకాలం ఎదురుచూశారని అన్నారు. యూనివర్సిటీలలోని ఖాళీలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు.

నలుగురి ఉద్యోగాలు ఊడిపోయిన దుఃఖంలో ఉన్న విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ప్రభుత్వం జిరాక్స్‌ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించబోదని, ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకోబోదని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు.

వీడియోలు ఇవిగో, ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్న సీఎం.. ఆలస్యమైనా ఆయనకు భారతరత్న దక్కడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అసెంబ్లీలో తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని ఆరోపించారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామన్నారు. మైనార్టీల హక్కులను తమ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ప్రజావాణి కార్యక్రమం గురించి బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని... కానీ ఆ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ప్రజావాణి కోసం ఓ ఐఏఎస్ అధికారిని నియమించినట్లు చెప్పారు. ధరణి, హౌసింగ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ పాపం ఎవరిది? అని ప్రశ్నించారు.

ప్రజాభవన్‌కు పూలే పేరు పెట్టామని... దానిని ప్రతిపక్షం అభినందిస్తుందనుకుంటే అలా చేయలేదన్నారు. ప్రగతి భవన్‌ను ఆగమేఘాల మీదపూర్తి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాళోజీ క్షేత్రాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జయశంకర్ గారి ఊరును రెవెన్యూ డివిజన్‌గా మార్చామన్నారు. 97వేల కోట్ల ఖర్చుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కనీసం 90వేల ఎకరాలకు నీరు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీని పదేపదే వారసత్వ పార్టీ అని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని... కానీ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిందన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం చేసిన త్యాగం ఏమిటో చెప్పాలన్నారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని వదులుకున్నారన్నారు. ఉద్యమం సమయంలో రాజీనామా చేసి మళ్లీ మూడు నెలలకు పదవులు స్వీకరించడమే వారు చేసిన పని అన్నారు. వీటిని త్యాగాలుగా చెప్పుకోవద్దని హితవు పలికారు. కలెక్షన్లు, ఎలక్షన్లు, సెలక్షన్లు బీఆర్ఎస్ తీరు అని ఆరోపించారు.

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరాడాలంటే ప్రధాని మోదీతో కొట్లాడాలన్నారు. మరి మోదీ నల్గొండలో ఉంటారా? అక్కడ బీఆర్ఎస్ సభ ఎందుకు? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై పోరాడాలంటే అమరులవడమో... హక్కులు సాధించడమో బీఆర్ఎస్ నేతలు చేయాలని... అందుకు ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. కేంద్రం ప్రాజెక్టులు తీసుకుంటే ధర్నా చేయాల్సింది ఢిల్లీలోనా? నల్గొండలోనా? అని నిలదీశారు. దమ్ముంటే ప్రాజెక్టుల కోసం నల్గొండలో కాకుండా ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకే 47తో పోలీసులను నాగార్జున సాగర్ వద్దకు పంపించారని... అది మన భూభాగమని... కేసీఆర్ అనుమతి లేకుండా జగన్ అక్కడకు పోలీసులను ఎలా పంపిస్తారని నిలదీశారు. మన ప్రాంతంలోకి వచ్చి తుపాకులు పెట్టి ఆక్రమించుకుంటుంటే ఇంటి దొంగలు లేకుండా నాగార్జున సాగర్ మీద ఏపీ పోలీసులు పహారా కాసే అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు.

నేటి ఏపీ మంత్రి రోజా గారు ఆ రోజు పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని... రాయలసీమను రతనాల సీమగా చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్... ఇప్పుడు కృష్ణా నీటి ప్రాజెక్టులపై మౌనంగా ఉండిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాగార్జున సాగర్ డ్యాం వద్దకు ఏపీ ముఖ్యమంత్రి పోలీసులను పంపించారన్నారు. కేసీఆర్ అండ లేకుండా ఎలా పంపిస్తారని నిలదీశారు. ఈ సందర్భంగా వారు పెట్టిన పులుసు తిని... వీరు ఇచ్చిన అలుసు వల్లే ఇలా జరిగిందన్నారు.

ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్‌బీసీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల మీద మరణ శాసనం రాశారన్నారు. కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ హక్కుల కోసం తాము కొట్లాడుతుంటే తమ కాళ్లకు కట్టె పెడుతున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ నేతలు తామేదో త్యాగం చేసినట్లుగా చెబుతారని... కానీ త్యాగం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అన్నారు. ఉద్యమం సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చే దాకా ఆ పదవిని తీసుకోనని చెప్పి కట్టుబడి ఉన్నారన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు కలెక్షన్లు, సెలక్షన్లు, ఎలక్షన్లతో ముందుకు సాగారని ఆరోపించారు. రైతు బిడ్డ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. సీఎం పీఠంపై రైతుబిడ్డ కూర్చోవడం కొంతమందికి ఇష్టం లేదేమో అన్నారు.

రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’ను మార్చుతామని వెల్లడించారు. ఈ గేయాన్ని తెలంగాణ కవి అందెశ్రీ ప్రజలకు అందించారని, ఈ పాట ద్వారా ఊపిరి పీల్చుకొని లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు, నగరాలు, పట్టణాలు, పల్లెలు, గ్రామాలు, అన్ని వీధుల్లోనూ ఇదే గేయం మోర్మోగిందని సీఎం ప్రస్తావించారు.

‘జయజయహే తెలంగాణ’ నినాదంతో రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రాన్ని సాధించిన ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుతామని స్పష్టం చేశారు. ఆ నాడు తెలంగాణ సాధన ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిన గొప్పదనాన్ని ఒక దళిత బిడ్డకు ఇవ్వకూడదన్న ఆలోచనతో, కుట్రతో నాటి పాలకులు జయజయహే తెలంగాణ గానాన్ని తెలంగాణలో వినిపించకుండా చేశారని, దాదాపు నిషేధించినంత పనిచేశారని ఆరోపించారు. అందుకే ఉద్యమస్ఫూర్తితో, ఉద్యమాలను గౌరవించే పార్టీగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ బిడ్డలా లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే విగ్రహం ఓ తల్లిలా ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా మార్చుతామని వెల్లడించారు. రాచరికపు ఆనవాళ్లు ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు నచ్చడంలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర గేయం, చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయంలో తమకు ఎలాంటి ఆశలు, ఆశయాలు లేవన్నారు. ఈ విషయంలో ఏవైనా సూచనలు, సలహాలు ఉంటే చెప్పాలని స్పీకర్‌కి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యాన్ని మహిళల కోసం తీసుకొచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కానీ ఆటోడ్రైవర్లకు నష్టం జరుగుతోందని ప్రతిపక్ష సభ్యులు అనడం సబబుకాదన్నారు. తెలంగాణ సమాజంలోని ఆడబిడ్డలను అక్కున చేర్చుకోవాలనే సదుద్దేశంతో, మంచి ఆలోచనతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించాం. 2014 నుంచి 2019 మంత్రివర్గంలో ఒక ఆడ బిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడ ఉన్నవాళ్లు ఏ రోజు కూడా ఎందుకు ఇవ్వలేదని అడగలేదు.

ఆ సాహసం చేస్తే ఉన్న ఉద్యోగం కూడా ఊడుతుందనే సంగతి వాళ్లకు తెలుసు కాబట్టే అడగలేదు. ఆ ప్రభుత్వం మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డల కోసం మా మంత్రి పొన్నం ప్రభాకర్, మేము ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఇప్పటివరకు దాదాపు 15 కోట్ల 21 లక్షల మంది ఆడబిడ్డలు ప్రయాణించారు. రూ.535.52 కోట్లు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చుపెట్టింది. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఫర్వాలేదు. కానీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి తగలబెట్టడం సరికాదు.

కిరాయి డబ్బులే రావడం లేదు, సంసారం నడవడంలేదన్న ఆటో డ్రైవర్.. ఆటోని తగలబెట్టాడంటే అతడికి ఎన్ని డబ్బులు కావాలి? ఇలాంటి చర్యల ద్వారా తెలంగాణ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారు? ఇంకో నటుడేమో రూ.100 పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ పది పైసల అగ్గి పెట్టె కొనుక్కోడు. అతడికి అగ్గిపుల్ల దొరకదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోవడం సభకు గౌరవం కాదని... ఆ కుర్చీ ఖాళీగా ఉండటం వల్ల ప్రయోజనం ఉండదని... ఆయన సభకు వచ్చి ఈ ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే సూచనలు చేస్తే బాగుండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్ధేశించి అన్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని... తెలంగాణ అంటే ఒక భావోద్వేగం అన్నారు. ఇలాంటి తెలంగాణలో మీలో (బీఆర్ఎస్) మార్పు రావాలని ప్రజలు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించి... ఈ హోదా ద్వారా ప్రజల తరఫున కొట్లాడేందుకు మరో అవకాశం ఇచ్చారన్నారు.

కానీ ప్రధాన ప్రతిపక్ష నేత... గవర్నర్ ప్రసంగానికి హాజరు కాలేదన్నారు. ప్రతిపక్ష నేత సభకు హాజరై... మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు ఏవైనా ఉంటే సూచనలు చేసేలా ఉండాలన్నారు. కానీ ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం బాధాకరమన్నారు. 80వేల పుస్తకాలను చదివానని కేసీఆర్ పదేపదే చెబుతారని... కానీ అందుకు అనుగుణంగా నడుచుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా సభకు రావాలని కోరుకుంటున్నామన్నారు.

తమ పాలన అరవై రోజులు పూర్తి చేసుకుందన్నారు. ప్రతిక్షణం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే తాము ముందుకు సాగుతున్నామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడినప్పుడు తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను మెచ్చుకొని, ఇతర వాటిలో సూచనలు చేస్తారని భావించానని... కానీ వారి నాయకుడి మెప్పు కోసం ఆయన తమపై దాడి చేసినట్లుగా కనిపించిందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఎన్నో లోపభూయిష్ఠ నిర్ణయాలు జరిగాయని విమర్శించారు. 9 ఏళ్లయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. సమైక్యాంధ్రలో ఉన్న నిర్బంధాలు గత తొమ్మిదేళ్లలోనూ కొనసాగాయన్నారు.

TG అంటే తెలంగాణ ఆత్మగౌరవమని... అందుకే తాము TS నుంచి టీజీగా మార్చామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తాము సరిదిద్దే ప్రయత్నం చేశామన్నారు. అలాగే అధికారిక చిహ్నంలో రాచరిక పోకడలు, రాచరిక దర్పం కనిపిస్తున్నందున మార్చాలని నిర్ణయించామన్నారు. గవర్నర్ ప్రసంగంలో వీటన్నింటినీ పొందుపరిచామన్నారు. తెలంగాణ తల్లి అంటే మన అమ్మ... అక్క... సోదరి.. వారు ఎప్పుడూ బంగారం, వజ్రవైడూర్యాలు పెట్టుకున్న సందర్భాలు లేవన్నారు.

తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మలా ఉండాలని ఆశించాం.. కానీ రాచరిక పోకడతో వజ్రవైడూర్యాలతో గత ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. అందుకే తెలంగాణ తల్లిని మార్చాలని నిర్ణయించామన్నారు. ఉద్యమం సమయంలో ఎక్కడ చూసినా 'జయజయహే తెలంగాణ' గేయం వినపడిందని గుర్తు చేశారు. అందుకే ఈ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా మార్చామన్నారు.

తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే తమపై శాపనార్థాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని... రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఆరోపించారు. అయినప్పటికీ తాము ఉద్యోగులకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నామన్నారు. రైతుబంధు వేయలేదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని... కానీ గతంలో వారు ఎలా వేసారో గుర్తుంచుకోవాలన్నారు. 2018-19లో రైతుబంధు వేయడానికి 5 నెలలు పడితే, 2019-20లో తొమ్మిది నెలలు, 2020-21లో నాలుగు నెలలు, 2021-22లో నాలుగు నెలలు పట్టిందన్నారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని తాము పదేపదే చెబుతున్నప్పటికీ రెండు నెలలు గడవకముందే విమర్శలు చేయడం ఏమిటన్నారు.