CM KCR Yadadri Tour: యాదాద్రిలో పల్లకి మోసిన కేసీఆర్, విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం జ‌లాభిషేకం, కొనసాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటన
CM KCR Yadadri Tour (Photo-Video Grab)

Yadadri, Mar 28; యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొద‌ల‌య్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో సీఎం కేసీఆర్ (Telangana Chief Minister K Chandrashekar Rao), ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌భుత్వ అధికారులు, అర్చ‌కులు, వేద పండితులు పాల్గొన్నారు.

శోభాయాత్ర‌లో భాగంగా బంగారు క‌వ‌మూర్తులు, ఉత్స‌వ విగ్ర‌హాలు, అళ్వార్లు ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణాలు, మేళ‌తాళాల మ‌ధ్య శోభాయాత్ర వైభ‌వంగా కొన‌సాగుతోంది. ఆల‌యం (Sri Lakshmi Narasimha Swamy Temple in Yadadri) చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు. ప్రధానాలయ పంచతల రాజగోపుర‌రం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు.

దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్‌కు కంక‌ణ‌ధార‌ణ చేసి పండితులు ఆశీర్వ‌చ‌నం అందించారు. 7 గోపురాల‌పై ఉన్న క‌ల‌శాల‌కు ఏక‌కాలంలో కుంభాభిషేకం, సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు.

రాజ గోపురాల‌పై స్వ‌ర్ణ క‌ల‌శాల‌కు 92 మంది రుత్వికుల‌తో సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. విమాన గోపురాల శిఖ‌రాల‌పై క‌ల‌శ సంప్రోక్ష‌ణ కైంక‌ర్యాలు నిర్వ‌హించారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేశారు.