Woman's Custodial Death: మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు, మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Telangana CM KCR | File Photo

Hyderabad, June 26: తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్లో దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని, నిజనిర్దారణ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ (Telangana CM K Chandrasekhar Rao) ఆదేశించారు. అవసరమైతే బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన మరియమ్మ లాకప్‌ డెత్‌ (Custodial Death of Dalit Woman ‘Mariamma’) అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు.

మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధితురాలి కుమారుడు ఉదయ్‌ కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందజేయాలని, ఇద్దరు కుమార్తెలకు చెరో రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందచేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. చింతకానికి వెళ్లి లాక్‌పడెత్‌ (Dalit woman's custodial death) సంఘటన పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డీజీపీని ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ప్రీతం కలిశారు.

ఐసోలేషన్‌కి రూ.4000, ఐసీయూ అయితే రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రూ.9 వేలు, పీపీఈ కిట్ ధర రూ.273, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స,టెస్ట్ ధరలను నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

ఇదిలా ఉంటే పోలీసుల కస్టడీలో మరణించిన దళిత మహిళ మరియమ్మ ఘటనపై న్యాయవిచారణ జరపాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఆలేరు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ విచారణ జరిపి సీల్డు కవరులో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అవసరమైతే మరియమ్మ మృతదేహాన్ని వెలికి తీసి తిరిగి పోస్టుమార్టం చేయాలని, రీ పోస్టుమార్టం నివేదిక సైతం సీల్డు కవరులో కోర్టుకివ్వాలని ఆదేశించింది. తమ ఆదేశాలను తక్షణమే ఆలేరు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు చేరవేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ టి. వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. మరియమ్మ లాకప్‌ డెత్‌పై న్యాయ విచారణకు ఆదేశించాలని, రూ.5 కోట్లు పరిహారం చెల్లించి, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) సంస్థ ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పి. శశికిరణ్‌ వాదించారు.

దొంగతనం చేశారనే ఆరోపణలపై మరియమ్మ, ఆమె కుమారుడు, అతని స్నేహితుడిని అడ్డగూడూరు పోలీసులు ఈనెల 16న నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని ఆయన అన్నారు. పోలీసుల చిత్రహింసలకు తాళలేక మరియమ్మ ఈనెల 18న పోలీసు స్టేషన్‌లో మరణించిందన్నారు. చిత్రహింసలకు తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కోర్టుకు తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను కోర్టుకు అందజేసినట్లు తెలిపారు. జూన్‌ 16 నుంచి 18వరకు పోలీసుస్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజిని కోర్టు పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు.

ఈ ఘటనపై ప్రభుత్వం మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించిందని, స్థానిక ఆర్డీవో విచారణ జరుపుతున్నట్లు ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశామని, డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారం పోస్టుమార్టం ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేసిన తర్వాత మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. పోలీసు కస్టడీలో మహిళ మరణించినా, అత్యాచారానికి గురైనా జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ చేత విచారణ జరిపించాలని సీఆర్‌పీసీ సెక్షన్‌ 176(1)(ఏ)లో ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. నిబంధనలు పక్కన పెట్టి ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ చేత విచారణకు ఆదేశించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.

పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాల ఫుటేజిని కోర్టుకు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఇంకా అమర్చలేదని ఏజీ చెప్పారు. దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ధర్మాసనం గుర్తుచేసింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంలో జాప్యం జరిగితే సుప్రీంకోర్టుకే వెళ్లి చెప్పుకోవాలని స్పష్టం చేసింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటే ఆ ఫుటేజిని పరిశీలించి లాకప్‌ మరణంలో పోలీసుల పాత్ర లేదని రుజువు చేసుకునే అవకాశం వారికి ఉండేదని ధర్మాసనం అభిప్రాయపడింది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజి లేదని చెబుతున్నందున వారే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

సీఎల్పీ నేత భట్టి విక్రమార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ చైర్మన్‌ ప్రీతమ్‌ తదితరులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి మరియమ్మ లాకప్‌డెత్‌కు కారకులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఖమ్మంజిల్లా చింతకాని మండలం కోమటిగూడేనికి చెందిన మరియమ్మ.. యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురంలో ఓ ఇంట్లో వంటమనిషిగా పనిచేశారు. ఆ ఇంట్లో దొంగతనం జరగడంతో అడ్డగూడూరు, చింతకాని పోలీసులు మరియమ్మను, ఆమె కొడుకు ఉదయ్‌కిరణ్‌ను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని భట్టి విక్రమార్క వినతిపత్రంలో పేర్కొన్నారు. దెబ్బలను తట్టుకోలేక మరియమ్మ మృతిచెందినట్టు తెలిపారు.