Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

Hyderabad, April 24: కరోనావైరస్ కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ (Covid Vaccine Free in Telangana) ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ( K Chandrashekar Rao) మాట్లాడుతూ ‘‘వయసుతో నిమిత్తం లేకుండా అందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నాం. వ్యాక్సినేషన్ కోసం 2,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుంది.

భారత్‌ బయోటెక్, రెడ్డీ ల్యాబ్స్ సహా కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి.. పూర్తిగా కోలుకున్న తర్వాత అధికారులతో సమీక్షించి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. రెమిడిసివర్, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు అధైర్యపడొద్దని తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్లక్ష్యంగా ఉండరాదని సూచించారు.

ఇప్పటివరకు 30 లక్షల మందికి వ్యాక్సిన్ అందించిన తెలంగాణ సర్కార్.. ఇక రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాకు వ్యాక్సిన్ పంపిణీ చేయనుంది. దీని వల్ల ప్రభుత్వం మీద 2500 కోట్ల రూపాయల భారం పడనుంది. దీనిపై సంబంధిత అధికారులకు, సీఎస్‌కు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజుల్లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

18 ఏళ్ల పైబడిన వారందరికీ ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత వ్యాక్సిన్; కేసులు పెరుగుతున్న దృష్ట్యా శనివారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధింపు

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించనున్న ఆయన.. జిల్లాల వారీగా ఇంచార్జీల నియామకంతో వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం కూడా 18 ఏళ్లు పైబడినవారికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది. అలాగే హర్యానా ప్రభుత్వం కూడా ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తాజాగా ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.