Patna, August 31: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గల్వాన్ అమరవీరుల కుటుంబాలతో పాటు హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా (CM KCR distributes cheques to families of Galwan soldiers) సీఎం నితీష్‌కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు అందజేశారు.
గల్వాన్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు అందించారు.
అదేవిధంగా హైదరాబాదులో జరిగిన అగ్నిప్రమాదంలో (Bihar migrant workers in Patna) మరణించిన సికిందర్ రామ్, దినేశ్ కుమార్, బిట్టూ కుమార్, దీపక్ రామ్, సత్యేంద్ర కుమార్, ఘటీ లాల్ రామ్, రాజేష్ కుమార్, అంకజ్ కుమార్ రామ్, ప్రేమ్ కుమార్, సిందు మహల్దార్, దామోదర్ మహల్దార్, రాజేష్ కుమార్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్, ఉపముఖ్యమంత్రి తేజస్వితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ అందజేశారు.
గాల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. భారతీయ ప్రాచీన చరిత్ర నుంచి నేటి వరకు నలంద విశ్వవిద్యాలయం పేరు వింటేనే యావత్ దేశం పులకించి పోతుందన్నారు. దక్షిణ గంగగా పిలిచే గోదావరి ప్రవాహ సదృశ్యంగా బిహార్‌తో తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నదని చెప్పారు. దేశ రక్షణ కోసం పోరాడుతూ గల్వాన్ లోయలో అమరులైన వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని శ్లాఘించారు. వీర సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేందుకే ఇక్కడి వచ్చామని వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం మన బాధ్యత అని చెప్పారు.
అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని ఎంతో కాలంగా హృదయం భారంగా ఉండేదని, అందుకే ఈ పవిత్ర భూమికి చెందిన అమరులైన సైనికుల కుటుంబాలకు మా వంతు సహాయం చేస్తున్నామని చెప్పారు. కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం, కానీ అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో సైనికులకు, దేశ రక్షణ దళాలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు.కేంద్రం కరోనా టైంలో వలస కూలీలను, కార్మికులను ఇబ్బంది పెట్టింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక రైళ్ల ద్వారా వాళ్లను స్వస్థలానికి తరలించిందన్నారు.
ఇదే సమయంలో తెలంగాణా వికాసంలో భాగస్వామ్యం అవుతున్న బీహార్ బంధువులు ఎంతో మంది ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో దురదృష్టవశాత్తు మరణించారని విచారం వ్యక్తం చేశారు. వీరి కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణకు వస్తున్న వలస కూలీలను తెలంగాణ ప్రగతి ప్రతినిధులుగా పేర్కొన్న సీఎం కేసీఆర్.. కరోనా సమయంలో వారు ఇబ్బంది పడకుండా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అభివృద్ధి బాటలో సాగుతున్న యువ రాష్ట్రమని, తమ రాష్ట్రాభివృద్ధిలో బిహార్‌కు చెందిన వేల మంది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందించారని చెప్పారు.
గొప్ప ప్రభుత్వంగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం.. కరోనా సమయంలో ప్రత్యేక రైళ్ళను నడపాలని కోరినా పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. బిహార్ కార్మికుల కోసం ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసి ఎంతో మందిని వారి స్వస్థలాలకు తరలించామని వెల్లడించారు. తెలంగాణకు వలస వచ్చిన వారందరికి మా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని భావిస్తున్నట్లు చెప్పారు. జయ ప్రకాశ్ నారాయణ్ జన్మించిన ఈ పవిత్ర భూమి నుంచి ప్రజల చైతన్యంతో ప్రారంభమయ్యే ప్రతీ మార్పు శాంతికి దారి తీసిందని చెప్పారు.