Special Vaccination Drive: రోజుకు 3 లక్షల మందికి టీకాల పంపిణీ, రాష్ట్రంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం; తెలంగాణలో ప్రస్తుతం 5 వేల పైబడి ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 249 కోవిడ్19 కేసులు నమోదు కాగా, ఇద్దరు కరోనాతో మరణించారు. ఇక మహమ్మారి నుంచి మరో 313 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,258 ఆక్టివ్ కేసులు...

Special Vaccination Drive: రోజుకు 3 లక్షల మందికి టీకాల పంపిణీ, రాష్ట్రంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం; తెలంగాణలో ప్రస్తుతం 5 వేల పైబడి ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసులు
COVID-19 Vaccination (Photo Credits: PTI)

Hyderabad, September 13: కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నందున రాష్ట్రానికి కూడా సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్ లో ప్రజలకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యాసంస్థల్లో కరోనా ప్రభావం పెద్దగా లేదని వైద్యాధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కరోనా ఎక్కువయ్యే అవకాశాలు కనిపించడం లేదని అధికారులు అన్నారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాలు పైబడిన అర్హులు 2 కోట్ల 80 లక్షల మంది ఉండగా, ఇప్పటికే 1 కోటి 42 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్, 53 లక్షల మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, మరో 1 కోటి 38 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేయాల్సి ఉందని సమీక్షలో వైద్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించడానికి చేపట్టే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మరియు ఇతర ప్రజా ప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని, ఎంపీఓలు, ఎంపీడీఓలు, డీఎల్పీఓలు, డీపీఓలు, జెడ్పీ సీఈఓలు మరియు ఇతర సిబ్బంది వీటిని సమన్వయం చేసి, వైద్య సిబ్బందికి పూర్తి సహకారాన్ని అందించి వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.

కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో గ్రామాల్లో లాక్ డౌన్లు పెట్టుకోవడంతోపాటు కరోనా పేషంట్ల కోసం స్కూళ్లలో ఐసొలేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి సర్పంచులు ప్రజలకు అండగా నిలిచారని సీఎం అభినందించారు. అలాగే, ఇప్పుడు చేపట్టే వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా భాగస్వాములు కావాలని సీఎం కోరారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి కలెక్టర్లు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

వ్యాక్సినేషన్ సిబ్బందికి భోజన వసతి సహా ఇతర సౌకర్యాలు కల్పించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్ సెంటర్లుగా స్కూళ్లు, కాలేజీలు, రైతు వేదికలు తదితర ప్రభుత్వ/ప్రైవేటు భవనాలను ఉపయోగించుకోవాలని, అవసరమైన చోట్ల టెంట్లు వేసి శిబిరాలు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. టీకా ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదనే విషయాన్ని ప్రజలు గమనించాలని సీఎం కోరారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో లక్షణాలు ఉండి, వెంటనే అప్రమత్తమైన వారు త్వరగా కోలుకున్నారని, నిర్లక్ష్యం చేసిన వారు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయని సీఎం పేర్కొంటూ ఇకపై కూడా ఏమాత్రం స్వల్ప లక్షణాలున్నా సమీపంలోని పీహెచ్ సీ కేంద్రాల్లో చూపించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మాస్కులు కూడా తప్పనిసరిగా ధరించాలని సీఎం ప్రజలను కోరారు.

ఒకవేళ భవిష్యత్ లో కరోనా, ఇతరత్రా సీజనల్ వ్యాధులు సహా ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్స్, బెడ్స్ ఏర్పాటు విషయంలో తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిందని, ఇక ముందు వైద్యం, విద్యకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించినట్లు సీఎం పేర్కొన్నారు.

మెడికల్ కాలేజీలు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, త్వరగా పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. వైద్యరంగంలో విశిష్ట సేవలందిస్తున్న నిమ్స్ దవాఖానా పరిధిలో మరో రెండు టవర్స్ నిర్మించి వైద్య సేవలను విస్తృత పరచాలని సీఎం ఆదేశించారు. శుభ్రత ఇతర సేవల విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులు కార్పోరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మందులు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.

ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 249 కోవిడ్19 కేసులు నమోదు కాగా, ఇద్దరు కరోనాతో మరణించారు. ఇక మహమ్మారి నుంచి మరో 313 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,258 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.

(The above story first appeared on LatestLY on Sep 13, 2021 08:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).